Bluepadమేనరికం
Bluepad

మేనరికం

V
Valipe Raghavenderrao
27th Jun, 2020

Share

"విక్రమ్  బావను చేసుకోనుగాక చేసుకోను" అంది ప్రియాంక.
"ఏం , బావకు ఏం తక్కువైందని ప్రశ్నించాడు "తండ్రి పురుషోత్తమ రావు.
" ఏమో నాకు బావంటే మొదటి నుంచి అంత సదభిప్రాయం లేదు"
" బావ మంచి ఉన్నత చదువు చదివాడు. బాగా సంపాదించాడు. హైదరాబాద్ లో , విజయవాడలో ఆస్థులు,  పొలాలు కూడా సంపాదించాడు.చిన్న తనంలో నే మంచి పేరు సంపాదించుకున్నాడు.మనం చూస్తున్న ఇతర సంబంధాలకు బావ ఏ రకంగా కూడా తీసిపోదు".
" ఏమో నాకు ఎందుకో బావ వాళ్ళ కుటుంబం అంటే అంతగా ఇష్టం లేదు. " అంది ప్రియాంక. " ఎందుకు అలా ఆలోచిస్తున్నావు " పురుషోత్తమ రావు. " ఏమో , తెలియదు " " నాకు తెలుసు . నీకు బావ గురించి వ్యతిరేక అభిప్రాయం రావడానికి ముఖ్యంగా మీ అమ్మే కారణం .తల్లి మాటను పిల్లలు గుడ్డిగా నమ్మడం సహజమే."
" మీరు ఎందుకలా అనుకుంటున్నారు?"
" మొదటి నుండి మీ అమ్మకు నా చెల్లెలు వందన అంటే అసలు పడదు.వందన మొదటి నుండీ ఎన్నో కష్టాలను ఎదుర్కుంది. ఆమె వివాహం జరిగిన నాటి నుండి  ఆమె ఎదుర్కున్న బాధలు అన్నీ ఇన్నీ కావు."అన్నాడు పురుషోత్తం రావు.
" ఏం జరిగింది  నాన్నా "
చెప్పసాగాడు పురుషోత్తం రావు.               @@@@@@
"మాది మధ్య తరగతి కుటుంబం. మా నాన్నగారు శ్రీనివాసరావు ఓ ప్రభుత్వ కార్యాలయంలో సీనియర్ క్లర్క్ గా పనిచేసే వారు. మా చెల్లెలు వందనను మా తల్లి తండ్రులు ఎంతో గారాబంగా పెంచారు. ఆమె చిన్నతనం అంతా ఆడుతూ పాడుతూ చక్కగా గడిపింది.ఆటపాటలతో పాటు చదువులో కూడా మేటి.అందచందాలలో కుందనపుబొమ్మ. "
" పోటీ పరీక్షల్లో మంచి ర్యాంక్ సాధించి ఎమ్.సి.ఎ.లో సీటు సాధించింది.మంచి మార్కులతో ఎమ్.సి.ఎ.లో ఉత్తీర్ణత పొందింది."
ఆ రోజు మా నాన్న " వందనా మరి నీ చదువు పూర్తి అయింది కదా , నీకు వివాహం చేయాలని మీ అమ్మ , నేను అనుకుంటున్నాం, నీ అభిప్రాయం ఏమిటి ?"
" నాన్నా మరేం అనుకోనంటే ఒక మాట. మా క్లాస్ మేట్ ఆనంద్ చాలా మంచి వాడు . మన కులం వాడే. వాళ్ళ తల్లి తండ్రులను ఒకసారి కలిసి అడిగితే బాగుంటుంది " " అంటే మీరిద్దరూ ప్రేమలో పడ్డారా ? " సీరియస్ గా అడిగాడు శ్రీనివాసరావు. "అదేం లేదు నాన్నా , అతనంటే మంచి అభిప్రాయం అంతే " "సరే నేను అతని తల్లి తండ్రులను గురించి వివరాలు తెలుసుకుంటాను" అలా కొన్ని రోజులు గడిచాయి. " వందనా ఆనంద్ వివరాలు కనుక్కున్నాను . అతని తండ్రి విజయవాడలో కన్యకా పరమేశ్వరి గుడిలో ప్రధాన పూజారి. తల్లి గృహిణి. కానీ వారి కుటుంబం వైదిక బ్రాహ్మణ కుటుంబం. మనది నియోగి బ్రాహ్మణ కుటుంబం కదా" "ఐతే" "మన కుటుంబం తో వారి కుటుంబం సర్దుకు పోగలదా అనేది ప్రశ్న" "ఐనా ఈ నియోగి, వైదిక ఏంటి నాన్నా , మనం అంతా బ్రాహ్మణులమే కదా" " మన బ్రాహ్మణులు పైకి అందరూ ఒక్క లాగే కనిపించినా అంతర్గతంగా దాదాపు డెబ్బై పైచిలుకు శాఖలు ఉన్నాయి.వైష్ణవ, మధ్వ, స్మార్థ, ఇంకా పూజించే దేవుడిని బట్టి, నివాస ప్రాంతాలను బట్టి ఇలా అనేకానేక శాఖ లు ఏర్పడినవి. " " ఈ శాఖ ల మధ్య వివాహ సంబంధాలు నిషిద్దమా నాన్నా" "నిషిద్ధం ఏమీ కాదు. కానీ ఒక శాఖ అంటే ఇంకో శాఖ కు పడకపోవడం,చారిత్రక, ఆచారపరమైన  పరస్పర విమర్షలు సహజంగానే ఉన్నాయి." "మరి ఎలా" "వారి తల్లిదండ్రులను అడిగి చూద్దాం"
ఒక మంచి రోజు చూసి శ్రీనివాసరావు విక్రమ్ తండ్రి గణపతి శాస్త్రిని కలిసాడు.
గణపతి శాస్త్రి  సనాతన బ్రాహ్మణుడు. వైదికాచార పరాయణుడు. అహంకారి. ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నవాడు.డబ్బు పిచ్చి మనిషి అని తెలిసిన వాళ్ళు అంటారు. వైదికాచారమును తూచా తప్పకుండా పాటించేవాడు.
శ్రీనివాసరావు గణపతి శాస్త్రిని కలవడానికి వెళ్ళినపుడు గణపతి శాస్త్రి కన్యకా పరమేశ్వరి అమ్మ వారికి భక్తులచే కుంకుమార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నాడు.
కొంత తడవు ఆగిన తరువాత గణపతి శాస్త్రి విరామంగా ఉన్న సమయం చూసి తనను తాను పరిచయం చేసుకున్నాడు శ్రీనివాసరావు.
విషయం చెప్పాడు.
" మేము మా అబ్బాయి కి నియోగి బ్రాహ్మణ అమ్మాయితో వివాహం చేయమండీ" తేల్చేశాడు  గణపతిశాస్త్రి.
"తప్పు ఏముందండీ, శాఖలు వేరయినా మనమంతా బ్రాహ్మణులమే కదా."
" వైదికులకు, నియోగులకు ఆచార పరంగానూ, ఆహార విహారాల పరంగా చాలా తేడాలు ఉంటాయి కదండీ, మా ఇంటికి వచ్చిన అమ్మాయి మడీ ఆచారం పాటించాలి.మా ఇళ్ళల్లో నిత్యం పూజాకార్యక్రమాలు, క్రతువు లు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ నియోగులకు అంతగా పాటింపు లేదు. వారి వృత్తి ముఖ్యంగా కరణీక పనులకు అంకితం అయినటువంటివి. కాబట్టి వారికి మా ఆచార వ్యవహారాలు అంతగా ఇచ్ఛగించవు. కాబట్టి మేము ఈ సంబంధం చేసుకోము."  చెప్పాడు గణపతి శాస్త్రి. నచ్చచెప్పడానికి ఎంతో ప్రయత్నించాడు శ్రీనివాసరావు. గణపతిశాస్త్రి ఎంతకూ ఒప్పుకోలేదు. చేసేది లేక వెనుతిరిగాడు శ్రీనివాసరావు. ఇంటికి వెళ్ళి కూతురు వందనకు , భార్య పద్మావతి కి విషయం చెప్పాడు. వాళ్ళు ఇద్దరూ బాధ పడ్డారు.
ఇంటికి వెళ్ళిన గణపతి శాస్త్రి కూడా శ్రీనివాసరావు తన వద్దకు వచ్చిన విషయం తన భార్య చంద్రకళకు , కుమారుడు ఆనంద్ కు  చెప్పాడు.
" ఈ రోజుల్లో వైదిక, నియోగి తేడాలు ఏంటి నాన్నా, కులాంతర వివాహాలు జరుగుతున్న ఈరోజు లలో శాఖాంతర వివాహాల గురించి పట్టింపు అంత అవసరంలేదు. ఐనా మేము ఇద్దరం  సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ చదివాము. నేను  పురోహితం చేయడం కష్టం. ఐనా నేను అమెరికా వెళుతున్నాను కదా . ఇద్దరం కలిసి వృత్తి పరంగా కూడా సంతోషంగా ఉంటాం " " ఐనా నేను భవిష్యత్ లో కూడా పురోహిత వృత్తిని చేపట్టాలని అనుకోవడం లేదు " " అదేంటిరా అలా అంటావు, తరతరాలుగా మన కుటుంబం పురోహిత వృత్తిలో ఎంతో పేరు సంపాదించుకున్నది. మన వృత్తి ఎంతో పవిత్రమైనది. ఇక్కడ డబ్బు ప్రధానం కాదు." " అదికాదు నాన్నా, మీరు పాడుపడిన గుడిని మీ కృషి తో ఎంతో అభివృద్ధి చేశారు. అంతవరకు ఎవరూ పట్టించుకోని వాళ్ళంతా గుడి మీద ఒక కమిటీ వేసి మిమ్మల్ని ఒక నామమాత్ర పూజారిగా మార్చారు.మనం గతం నుంచే ఇంతో అంతో కలిగిన వాళ్ళం కాబట్టి సరిపోయింది.లేకపోతే ఇతర పురోహితుల మాదిరిగానే మన పరిస్థితి ఉండేది. అంతేకాదు గుడికి రాజులకాలం నుండి వచ్చిన భూములను అన్యాయం గా ఎవరి ఇష్టం వచ్చినట్లుగా ఆక్రమించుకొన్నారు. కోర్టు ల చుట్టూ తిరుగుతూ మీరు మీ స్వంత డబ్బును ఎంతగా ఖర్చు చేసారో అందరికీ తెలుసు. మళ్ళీ మేము కూడా ఈ పురోహిత వృత్తిని చేపట్టాలా?"
" సరే మీ ఇష్టం " అన్నాడు గణపతి శాస్త్రి.
శ్రీనివాసరావు కు కబురు పంపించాడు గణపతి శాస్త్రి.
" మీరు మీ ఆలోచనలు మార్చుకున్నారా? " అడిగాడు శ్రీ నివాసరావు. " పిల్లల ఆలోచనలను బట్టి మనం మన ఆలోచనలు మార్చుకోకతప్పదు కదా." "కానీ మాది ఒక షరతు. వివాహం మేము నివాసం ఉంటున్న విజయవాడ లోనే జరగాలి." "అదేంటండీ వివాహం అమ్మాయి ఊరిలోనే జరగాలి అన్నది సాంప్రదాయం కదా, మా ఊరిలో ఐతేనే మాకు అనుకూలంగా ఉంటుంది." "లేదు లేదు మేము కట్న కానుకల విషయంలో ఎక్కువగా పట్టింపులు పెట్టుకోము. కానీ వివాహం మాత్రం విజయవాడలో నే జరగాలి."     ఇంటికి వెళ్ళి భార్య అభిప్రాయం అడిగాడు శ్రీనివాసరావు. అమ్మాయి, అబ్బాయి పరస్పరం ఇష్టపడుతున్నారు కదా, వివాహ స్థలం గురించి రాజీ పడదాం అంది శ్రీనివాసరావు భార్య పద్మావతి. " వివాహ ముహూర్తం ఇంకా మూడు నెలలు ఉంది . ముందుగా ఎంగేజ్ మెంట్ చేద్దాం "అన్నాడు శ్రీనివాసరావు. "ఎంగేజ్ మెంట్ హైదరాబాద్ లో చేద్దాం."అన్నాడు శ్రీ నివాసరావు. "సరే " అన్నాడు శాస్త్రి. ఎంగేజ్ మెంట్ తనకు ఉన్నంత లో ఘనంగా చేశాడు శ్రీనివాసరావు. హైదరాబాద్ లోని 'అభిరుచి 'మినీ ఫంక్షన్ హాల్ లో ఎంగేజ్ మెంట్ నిర్వహించాడు. "మీ అమ్మాయి ని వైదికులకు ఇస్తున్నారా "అని శ్రీనివాసరావు బంధువులు, " నియోగుల అమ్మాయిని  చేసుకుంటున్నారా" అని గణపతి శాస్త్రి బంధువులు అనడం తరచుగా జరగడం ఇరువురికీ చివుక్కుమనిపించింది. వివాహ సమయం రానేవచ్చింది. విజయవాడలో ని ఒక ప్రముఖ కళ్యాణ మండపం బుక్ చేశాడు గణపతి శాస్త్రి.
" బావగారు, చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది  ఈ కళ్యాణ మండపానికి." అన్నాడు శ్రీనివాసరావు. ముఖం చిట్లించాడు గణపతి శాస్త్రి.
" మా హోదా కు తగినట్లు గా ఉండాలి కదా, ఇంకా ఎన్నో కళ్యాణ మండపాలు ఉన్నా మీకు ఇంకా ఎక్కువగా ఖర్చు అవుతుందని ఈ కళ్యాణ మండపం తీసుకున్నాం." అన్నాడు గణపతి శాస్త్రి.
ఏమీ అనలేకపోయాడు శ్రీనివాసరావు.
కట్నం తీసుకోలేదని పేరే కానీ లాంఛనాల పేరుతో భారీ గానే వసూలు చేశారు పెళ్ళి కొడుకు తరపు వాళ్ళు. పైగా పెళ్ళికొడుకు తరపు వాళ్ళు పెళ్ళి కూతురి బంధువులను అంతగా పట్టించుకోలేదు. ఏదో మా వాడు ఇష్టపడ్డాడు కాబట్టి ఈ వివాహం చేసుకుంటున్నారు తప్ప మాకు ఏ రకంగా కూడా మీరు సరిజోడు కాదు అన్నట్లు గా వారు వ్యవహరించారు.నిజానికి శాఖాంతర వివాహాలలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఇరువైపుల బంధువులు కలవడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. మేమే ఎక్కువ అంటే మేమే ఎక్కువ అనే విధమైన మాటలు , స్పర్థలు తలెత్తుతుంటాయి. వియ్యంకుల కుటుంబాలు తరచుగా కలవడం, బంధుత్వ వరుస లతో పిలుచుకోవడం కూడా తక్కువగా ఉంటుంది.
"మీకు చాలా మంచి సంబంధం దొరికింది" అని వ్యంగంగా చురకలంటించారు శ్రీనివాసరావు ను బంధువులు. ఈ విషయాలన్నీ గమనించిన వందన " నా వల్లనే నీకు ఈ కష్టాలు వచ్చాయి నాన్నా "అని కన్నీళ్లు పెట్టుకుంది.
ఎలాగోలా వివాహం పూర్తి అయింది. వందన అత్త గారింటికి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తరువాత భర్త తో పాటు అమెరికా వెళ్ళిపోయింది. వివాహ అప్పు చాలా అయ్యింది శ్రీనివాసరావు కు. అప్పు తీర్చడానికి మరింత అప్పు చేశాడు. శ్రీనివాసరావు కుమారుడు పురుషోత్తమ రావు కూడా తన తండ్రి అప్పు తీర్చడానికి నానా ప్రయాస పడ్డాడు. అప్పుడపుడే కాపురానికి వచ్చిన పురుషోత్తమ రావు భార్య వినీలకు ఈ వ్యవహారం అంతా చికాకు గా అనిపించింది. వందన తమకు తగిన సంబంధం కాకుండా ఆర్థికంగా ఉన్నత స్థాయి సంబంధం ,అదీ శాఖాంతర వివాహం కోరుకోవడం వలననే ఈ సమస్యలన్నీ ఉత్పన్నం అయ్యాయని ఆమె భావన. పెళ్ళి లో , ఆ తరువాత, తమ బంధువులు అందరికీ దూరంగా ప్రత్యేక ఏర్పాటు చేసి భోజనాలు పెట్టడం గురించి ఆమె మనసు చివుక్కుమంది.తమతో పాటు వియ్యాలవారు భోజనాలు చేయకపోవడం, దూరం దూరంగా మసలడం ఆమెను బాధించింది.
వినీల తల్లి సునయన కూడా వందన వల్లనే  పురుషోత్తమ రావు ఆర్థికంగా ఎదగలేక పోతున్నాడని అభిప్రాయం కూతురు లో నాటింది. అలాగే సునయన శ్రీనివాసరావు పాలివాళ్ళ దగ్గర బంధువు. ఏది ఏమైనా వందన అత్తగారి బంధువులలో ఆమె మామూలు కుటుంబం నుండి వచ్చిన స్త్రీ. తమకు తగిన సంబంధం కాదు. వందనకు ఇద్దరు మరుదులు, ఒక ఆడపడచు. వారి పెళ్ళిళ్ళు వారి శాఖలోనే చేశారు. దీంతో వందనకు పాత బంధువులు వారి అత్తగారి తరపున ఎవరూ లేకుండా పోయారు. "మీరింక మడీ, అచారాలన్నీ మరచి పోవాల్సిందేరా అబ్బాయ్" అని మామ్మగారు పెళ్ళినాడే ఈసడించేశారు. " శాఖాంతర వివాహం చేసుకున్నాడు ఆనందం, కులాంతర వివాహం చేసుకోలేదు . ఇంతే చాలు" అంది కామాక్షి , మామ్మగారి తోడికోడలు. " మేం మరీ ఆచారహీనులమేమీ కాదు " . అనాలనుకుంది వందన.కానీ అనలేక పోయింది. " ఇంకా నయం శాఖాంతర వివాహం చేసుకున్నాడు . కులాంతర వివాహం చేసుకోలేదు" అన్నది కామాక్షమ్మ, ఆనంద్ మేనత్త. వందనకు కొంతకాలం తరువాత తెలిసింది కామాక్షమ్మ తన కూతురు భవాని ని ఆనంద్ కు ఇచ్చి వివాహం చేయాలనుకున్నదని. " భవానిని వివాహం చేసుకోకుండా నన్నెందుకు చేసుకున్నావు ? అన్నది వందన ఒక సమయంలో ఆనంద్ తో. "మేనరిక వివాహం నాకు ఇష్టం లేదు. అందుకే " అన్నాడు ఆనంద్. కుటుంబ ఫంక్షన్స్, తదితరాల లో ఎప్పుడు కలిసినా భవాని తనతో ఎప్పుడూ మాట్లాడకపోవడం, దూరంగా మసలడం వందన గుర్తించింది. ప్చ్, ఏం చేస్తాం అని నసులోనే అనుకుంది. ఇక ఆనంద్ ఏ విషయంలో కూడా తండ్రి మాటను జవదాటడు. తాను, వందన సంపాదించిన డబ్బు తమ  ఖర్చులు పోను మిగిలినదంతా తండ్రికి పంపేవాడు. ఆ డబ్బుతో విజయవాడలో అనేక ఆస్థులు సంపాదించాడు గణపతి శాస్త్రి.భూముల ధరలు బాగా పెరగడం వలన వారి ఆస్తుల విలువ కూడా బాగాపెరిగింది. కాల క్రమంలో అమెరికాలో వచ్చిన మార్పుల వలన ఆనంద్ , వందనలు తమ ఉద్యోగాలు కోల్పోయారు.
భర్త, తన ఇద్దరు పిల్లలతో ఆమె ఇండియా తిరిగి వచ్చింది వందన. తమ ఆస్థి తమకు ఇవ్వాలని వారు గణపతి శాస్త్రి ని కోరారు. వందన మామగారు ఆస్థులను సరిగా  లెక్క చూపలేదు. చాలా ఆస్థులను దాచాడు. "అదేంటి మామ గారు మా సంపాదనను మాకు ఇవ్వండి" అని నిలదీసింది వందన. "మీరు మాకు పంపింది చాలా తక్కువ, నేను తెలివితేటలతో ఆస్థిని పెంచాను. ఎక్కువగా మాట్లాడితే అదికూడా ఇవ్వను" అన్నాడు గణపతి శాస్త్రి.
గణపతి శాస్త్రిని అతని ఇతర కుమారులు చాలా ప్రభావితం చేసేవారు. వారిలో ధన దాహం ప్రవేశించింది.
తనకు జరుగుతున్న అన్యాయాన్ని తల్లిదండ్రులు, అన్నా వదిన లకు చెప్పుకొని బోరుమంది వందన.
వారు కూడా గణపతి శాస్త్రిని నిలదీశారు. " ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి . చిల్లిగవ్వ కూడా ఇవ్వను. "అన్నాడు శాస్త్రి. బంధువులకు కూడా  తన బాధ చెప్పుకుంది. "అంత తెలివి లేకుండా ఎలా డబ్బు అంతా మీ మామగారికి పంపారు మీరు" అన్నారు వాళ్ళు.
ఆనంద్ తన తండ్రి ఇలా చేస్తాడని ఊహించలేదు.
చివరకు విషయం కోర్టు పాలయింది. కోర్టు కెక్కిన వాడు, కొండనెక్కిన వాడు తొందరగా దిగిరాడు అనేది అందరికీ తెలిసిందే కదా. దేశంలో అత్యంత విఫల వ్యవస్థ లలో న్యాయ వ్యవస్థ ఒకటి.కాలం కరిగిపోసాగింది.
ఒక వైపు తన అమెరికా అనుభవం తో ఒక చిన్న సాఫ్ట్ వేర్ కంపెనీ ని స్థాపించి దానిని కాల క్రమేణా మంచి స్థాయికి తీసుకుని వచ్చారు వందన, ఆనంద్ లు.
లాయర్ల మాయాజాలం తో కేసు అనేక మలుపులు తిరిగింది. చివరకు వందన, ఆనంద్ లకు న్యాయం జరిగింది. వారి  ఆస్థిని వారు చేజిక్కించుకున్నారు . ఈలోపు వందన , ఆనంద్ ల  కొడుకు  విక్రమ్ , కూతురు  లాస్య కూడా బాగా చదువుకున్నారు . విక్రమ్ సాఫ్టువేర్  ఇంజనీర్ గా,  కూతురు లాస్య  డాక్టర్ గా సెటిల్ అయ్యారు.                     @@@@ "ఇదమ్మా విషయం. మీ అత్త వందన ఎదుర్కొన్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు.జీవితాంతం కుటుంబ పోరాటాలు, కోర్ట్ పోరాటాలతోనే సరిపోయింది. మీ అమ్మకు , అమ్మమ్మకు మాత్రం మీ అత్త మీద సదభిప్రాయం లేదు. నీవు చెప్పుడు మాటలు వినకుండా విజ్ఞతతో ఆలోచించి బావను వివాహం చేసుకో " అన్నాడు పురుషోత్తం రావు. " సరే నాన్నా నేను అనవసరంగా అత్త వాళ్ళ కుటుంబం మీద వ్యతిరేక అభిప్రాయం పెంచుకున్నాను. మీరు అత్త తో మాట్లాడి బావతో  మా పెళ్లి ఏర్పాట్లు చేయండి. " సిగ్గు పడుతూ చెప్పింది ప్రియాంక.
( సమాప్తం)

15 

Share


V
Written by
Valipe Raghavenderrao

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad