Bluepad | Bluepad
Bluepad
ఆటా పాటా
డా.ఎం.హరికిషన్
21st Jun, 2020

Share


ఆటా పాటా
*ఆటా పాటా (సంయుక్త అక్షరాలు లేని కథ)* డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
**************************
మంగమ్మ సుబ్బయ్య మొగుడూ పెళ్ళాలు. ఇద్దరిదీ చూడచక్కని జంట. సుబ్బయ్య పాట పాడతా వుంటే మంగమ్మ ఆట ఆడతా వుండేది. వాళ్ళ ఆటా పాటా అంటే చుట్టుపక్కల చానా పేరు. వాళ్ళని పిలవని వూరులేదు. పొగడని నోరూ లేదు. సుబ్బయ్య పాట వింటే పసిపిల్లోడైనా సరే ఛటుక్కున ఏడుపు మాని చిరునవ్వులు నవ్వుతాడు. ఆ పాట వింటా వుంటే ఆకాశం నుండి పూల వాన రాలినట్టుండేది. చెమట పట్టిన ఎర్రటి ఎండలో చల్లని గాలి ఒక్కసారిగా శరీరాన్ని తాకినంత కమ్మగా వుండేది. ఇక మంగమ్మ సంగతి సరే సరి. ఆమె ఆట ఆడతావుంటే తెలియకుండానే వంటిలో వంద వీణలు మోగినట్టుండేది. పండు ముసలోడయినా సరే మంచం మీద నుండి లేసి అడుగులో అడుగు కలపవలసిందే. ఆ ఆటాపాటకు చుట్టుపక్కల భలే పేరు. కాసులు గలగలగల రాలేవి. అదేవారి వృత్తి, జీవనాధారం. చుట్టుపక్కల ఏ ఊరిలో జాతర జరిగినా, ఏ గుడి ముందు సంబరాలు మొదలయినా వీళ్ళ ఆటాపాటా పెట్టించేవాళ్ళు. మంగమ్మ ఆట, సుబ్బయ్య పాట అంటే మాటలు సరిగా రాని చిన్న పొట్టెగాని నుంచి, పైకి పోవడానికి రోజులు లెక్కబెట్టుకుంటూ వున్న ముసలోళ్ళ వరకు ఆడామగా తేడా లేకుండా మూగబడేటోళ్ళు. పాటలోకి దిగితే సుబ్బయ్య తనను తాను మైమరచి పోయేవాడు. జనాల అరుపులు, కేకలు, ఈలలతో మరింతగా వూగిపోయేవాడు. జలపాతంలా పదాలు పరవళ్ళు తొక్కేవి. అంతలో గజ్జె ఘల్లుమనేది. ఎక్కడి గుండెలు అక్కడ అలా అగిపోయేవి. మంగమ్మ ఒక్కొక్క అడుగే వేసుకుంటా వచ్చి పాటకు తగ్గట్లు చిందు తొక్కుతా వుంటే చూసేవాళ్ళు ఒళ్ళు మైమరిచిపోయేవాళ్ళు. చినుకు చినుకు కలిసి వానై, వంకై, వాగై, వరదై పోటెత్తినట్టు ఆటపాట కలసి ఏకమై నిమిషనిమిషానికీ వుర్రూతలూగించేవి. జనాలకు పూనకాలు వచ్చేవి. గొంతు కలుపుతూ, కదం తొక్కుతూ ఆనందం ఆకాశాన్ని తాకేది. సుబ్బయ్య ఎప్పుడూ ఒకటే పాటలు పాడకుండా కొత్త కొత్తవి అల్లేవాడు. ఏ పాటయినా సరే ఒక్కసారి వింటే... మనసులో నాటుకుపోయేలా... పల్లెజనాల మాటల్లోని రతనాలను ఏరుకొని, చిన్నచిన్న పదాలతో మల్లెల మాలలా కూర్చేవాడు, మంగమ్మ కొంచెం కూడా తగ్గేది కాదు. సుబ్బయ్య పాటకు తగ్గట్టుగా కొత్త కొత్త చిందులతో పరవశంగా వూగిపోతా జనాలను వూపేసేది. వాళ్ళిద్దరి మనసులు ఎప్పుడు ఆటపాటల మీదే. జనాలు ఎగిరి గంతులు వేసేలా, ఈలలు మోగిపోయేలా, పూనకాలు వచ్చి వూగిపోయేలా ఎలా పాడాలి, ఎలా ఆడాలి అనేది వారి ఆలోచన. కానీ ఏడాదంతా జాతరలు, తిరునాళ్ళు, పండుగలు వుండవు గదా. ఆటాపాటలకు వచ్చిన డబ్బులు పైసా పైసా తేనెటీగ లెక్క దాచి పెట్టుకొని వాడుకునేటోళ్ళు. ఖాళీ సమయాల్లో పొలం పనులకు పోయేటోళ్ళు.
ఎప్పటిలాగే ఆ ఏడాది గూడా ఎమ్మిగనూరు నీలకంఠుని జాతరకు పిలుపొచ్చింది. సై అన్నారు. ఇద్దరూ సంబరంగా, ఆటపాటలకు కావలసినవన్నీ సిద్ధం చేసుకోసాగారు. అంతలో వూహించని విధంగా ఆ వూరిలో అందరికన్నా పెద్ద ధనవంతుని నుంచి పిలుపొచ్చింది. “చూడూ... హైదరాబాదులో నా కూతురి పెళ్ళిని పెళ్ళికొడుకు తరపువాళ్ళు ఆధునిక పద్ధతిలో ఘనంగా జరిపితే, మరలి పెళ్ళి మన వూరిలో పక్కా పల్లెటూరి పద్ధతిలో మేం జరపాలని అనుకున్నాం. నీ ఆటాపాటా నాటుకోడి పులుసులో రాగిముద్ద కలుపుకొని తిన్నంత మజాగా వుంటాదంట గదా... చూసినోళ్ళందరూ లొట్టలేసుకుంటా చెబుతున్నారు. కాబట్టి ఆ రోజు నగరం నుంచి వచ్చే అతిథులందరినీ నీ ఆటపాటలతో అదరగొట్టాలి, ఏం సరేనా" అన్నాడు. మరలి పెళ్ళి ఎప్పుడో తెలుసుకున్న సుబ్బయ్య నసుగుతా "అయ్యా... అదే రోజు ఎమ్మిగనూరు జాతర. పాట పాడడం మొదలు పెట్టినప్పటి నుండి ఏ ఏడాది తప్పలేదు. ఏమీ అనుకోకండి. రాలేము" అన్నాడు.
“చూడు సుబ్బయ్య ... జాతరకేముంది. జీవితాంతం ఎప్పుడూ జరుగుతూనే వుంటుంది. నువ్వున్నా లేకపోయినా అది ఆగేది కాదు. కానీ పెళ్ళి వచ్చేది ఒక్కసారే. జాతరలో నీకిచ్చే దానికి పదింతలు ముట్టజెపుతా. కాదన్నా వదిలేది లేదు. ఈ ఊరిలో నా గురించి, నా బలం గురించి నీకు తెలుసు గదా" అంటూ ఒకవైపు డబ్బు ఆశ చూపుతూనే మరొక వైపు వేలు పైకెత్తి హెచ్చరించాడు. సుబ్బయ్య ఏమీ చేయలేక తల వంచుకొని తలూపాడు. నీలకంఠుని జాతరకు రాలేనని కబురు పంపాడు. దానికి వాళ్ళు “చూడు సుబ్బయ్యా... జాతరలో దేవున్ని చూడడానికి ఎంత మంది కదులుతారో, మీ ఆటాపాటా చూడటానికి అంతకు రెండింతలు పోటెత్తుతారు. అలా అని వాన్ని ఎదిరించి నిన్ను రమ్మని ఇబ్బంది పెట్టలేం. కానీ జాతర రాతిరంతా వుంటాది గదా, మరలి పెళ్ళి అయిపోయిన వెంటనే వచ్చేసేయ్. ఒక్క పాట పాడినా చాలు దేవుడు గూడా పరవశించి పోతాడు” అని చెప్పారు. సుబ్బయ్య గమ్మున తలూపాడు. మరలి పెళ్ళి రోజు రానే వచ్చింది. సుబ్బయ్య మంగమ్మల మనసంతా జాతరపైనే. కానీ మాట ఇచ్చాక తప్పదు కాబట్టి ఇద్దరూ కొత్త బట్టలేసుకోని అక్కడ అడుగు పెట్టారు. విశాలమైన తోటలో వేదిక మీద పెళ్ళికూతురు పెళ్ళికొడుకు. కింద ఖరీదయిన సోఫాల పై అతిథులు. తళతళలాడే పట్టుచీరలు, జిగజిగలాడే బంగారు హారాలు, ఘుమఘుమలాడే సెంటు సీసాలు, మిలమిలలాడే పట్టు పంచలు. ఒకరినొకరు గంభీరంగా పలకరించుకొంటున్నారు. చిరునవ్వులు పెదవి దాటకుండా రువ్వుతున్నారు. గుసగుసలాడుకుంటున్నారు. హుందాగా తలలూపుతున్నారు. బట్టలు మడత పడకుండా, దుమ్ము తగలకుండా, చెమట పట్టకుండా తిరుగుతున్నారు. వేదిక పైన కొత్తజంటను పలకరించి కొందరు దిగుతుంటే మరికొందరు కింద నుంచే చేతులూపుతున్నారు. తినేవాళ్ళు తింటున్నారు, తాగేవాళ్ళు తాగుతున్నారు. వాగే వాళ్ళు వాగుతున్నారు. సుబ్బయ్య, మంగమ్మని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఏదో బెరుకు గొంతులోనూ, నడకలోనూ... నెమ్మదిగా గొంతు సవరించుకొని పాట మొదలుపెట్టాడు. సుబ్బయ్య పాటకు తగ్గట్టుగా మంగమ్మ ఆట. కానీ ఈలలు లేవు, అరుపులు లేవు. కేరింతలు లేవు. పులకరింతలు లేవు. అందరూ మొహాలపై చిరునవ్వులు అతికించుకొని అప్పుడప్పుడు తలెత్తి పాడుతున్న వాళ్ళని వింత జంతువుల్లా, అనాగరికుల్లా చూసి మరలా తమ మాటల్లో తాము మునిగిపోతున్నారు. నెమ్మది నెమ్మదిగా సుబ్బయ్య పాటలో వూపు తగ్గిపోసాగింది. దానికి తగ్గట్టుగా మంగమ్మ ఆటలో లయ తప్పుతోంది. ఎలా పాడినా ఎవరూ పట్టించుకోవడం లేదు, గమనించడం లేదు. భోజనాలు చేసినవాళ్ళు చేసినట్టు వెళ్ళిపోతున్నారు. అందరూ నిమిష నిమిషానికి గడియారాలు చూసుకుంటున్నారు. అక్కడ తమ ఉనికికి కొంచెం గూడా విలువ లేదు. ఒక్కరు కూడా వాళ్ళ ఆటపాట కోసం వచ్చినోళ్ళు కాదు. సుబ్బయ్య గొంతు నెమ్మదిగా మూగబోసాగింది. అవమానంగా వుంది. దుఃఖంతో గొంతు బూడుకుపోసాగింది. తలెత్తి మంగమ్మ వంక చూశాడు. ఆమె ముఖం కూడా మబ్బులు మింగిన చందమామలా దిగాలుగా వుంది. కింద హడావిడి నెమ్మదిగా తగ్గిపోయింది. సుబ్బయ్య పాట ఆగిపోయింది. ధనవంతుడు వచ్చి జేబులోంచి డబ్బులు తీసి ఇవ్వబోయాడు, సుబ్బయ్య మంగమ్మ చేతులెత్తి దండం పెట్టి పాడింటే గద సామీ.... డబ్బులు తీసుకోడానికి అంటూ పైసలు తీసుకోకుండానే తలొంచుకొని కళ్ళనీళ్ళతో అక్కడినుండి వడివడిగా బైటపడ్డారు. సమయం పదకొండవుతా వుంది. సుబ్బయ్య మన్ను తిన్న పాములెక్క మౌనంగా మంగమ్మ చేయి పట్టుకున్నాడు. అడుగు తీసి అడుగు వేయలేక పోతున్నాడు. జీవితంలో మొదటిసారి ఇంత పెద్ద ఓటమి. మంగమ్మ ఆటో ఆపింది. వాని చేతిలో అయిదు వందలు పెట్టింది, ఆటో గాలిలో దూసుకుపోసాగింది... సుబ్బయ్య కళ్ళు మూసుకొని మంగమ్మ ఒడిలో తలబెట్టుకొని మగతగా నిదురపోసాగాడు.

ఏవో అరుపులు కేకలు, కోలాహలం, సుబ్బయ్య కళ్ళు తెరిచాడు. ఆటో ఎమ్మిగనూరు జాతర దగ్గర ఆగి వుంది. నడిరేయి కూడా అక్కడ పట్టపగలులా వుంది. తడిచిన మట్టి వాసన, జనాల చెమట వాసన కమ్మగా తాకుతోంది. ఇదేమి ఇంటికి కాకుండా ఇక్కడికి తెచ్చావు. ఈరోజు ఇక నాకు చేత గాదు” అన్నాడు నీరసంగా సుబ్బయ్య, “ముందు నువ్వు దిగు మామా” అంది చేయి పట్టుకొని మంగమ్మ. వాళ్ళు దిగుతా వుంటే ఒక ముసలోడు కళ్ళు పెద్దవి చేసి చూశాడు. "రేయ్... మన సుబ్బయ్య, మంగమ్మ వచ్చారురోయ్" అంటూ భూమి బద్దలయ్యేలా సంబరంగా గొంతు చించుకొని అరిచాడు. ఆ అరుపు అంటుకుంది దావానలం అయింది. అంతవరకు చప్పగా వున్న జనాల మొహల్లో సంబరం పొంగి పొరులుతోంది. కట్టలు దాటి దుముకుతోంది. సుబ్బయ్య మంగమ్మ జనాలు వచ్చి తమను చుట్టుకొనే లోపలే వేగంగా తప్పించుకుంటూ దూసుకుపోయారు. అంతవరకూ ఆవరించి వున్న నిస్సత్తువంతా పారిపోయింది.

ఈలలు కేకలు అరుపులతో వేయి ఏనుగుల బలం ఒంటిలోకి ఒక్కసారిగా చేరిపోయింది. గొంతు పువ్వులా విచ్చుకుంది. మైకు జీవం పోసుకుంది. గజ్జ ఘల్లుమంది. పాట పై నుంచి నేలకు దిగి... మనిషి మనిషినీ తాకుతా చిందులేయసాగింది. పైనా కిందా తేడా లేకుండా అంతటా ఆట పాట.

చెమటతో తడిసిన రూపాయి బిళ్ళలు సంబరంగా గాలిలోకెగిరాయి.

సుబ్బయ్య, మంగమ్మ పెదాలపై వేలపూలు పూశాయి.
**************************
డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
**************************

18 

Share


Written by
డా.ఎం.హరికిషన్

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad