యుద్ధాన్ని వాయిదా వేయడమే మంచిది..!
యుద్ధాన్ని వాయిదా వేయడమే మంచిది
వాకిలి నీదైనా నాదైనా
దీపాలు వెలుగుతూ వుండడమే మంచిది
నెత్తురు నీదైనా పరాయిదైనా
అది ఆదాము నెత్తురే కదా
యుద్ధం తూర్పున జరిగినా పడమట జరిగినా
అది ప్రపంచ శాంతి దారుణ హత్యే కదా
బాంబులు ఇళ్ళ మీద పడినా సరిహద్దులో రాలినా
గాయపడేది మానవాత్మే కదా
మాడి మసైపోయే పొలాలు నీవైనా పరులవైనా
ఆకలితో అలమటించే బాధ ఒకటే కదా
యుద్ధ ట్యాంకులు ముందుకు కదిలినా వెనక్కి మళ్ళినా
శూన్యమయ్యేది ధరిత్రి గర్భమే కదా
విజయ ధ్వానాలో..
పరాజయ శోకాలో
జరిగిన నష్టం మీద పడి తల బాదుకునేది జీవితమే కదా
యుద్ధమే ఒక తెగులు..
ఇంక ఏ రోగానికి అది మందు కాగలదు?
ఈ రోజు రక్తాగ్ని వర్షం కురవొచ్చు
అది రేపు మరింతగా పెంచేది క్షుద్బాధనే కదా
అందుకే నా సహోదర సజ్జనులారా
యుద్ధాన్ని వాయిదా వేయడమే మంచిది
వాకిలి నీదైనా నాదైనా
దీపాలు వెలుగుతూ వుండడమే మంచిది
మూలం: సాహిర్ లూధియాన్వీ (ప్రముఖ ఉర్దూ కవి)
తెలుగు: ప్రసాదమూర్తి
( 1965 ఇండో పాక్ యుద్ధం నేపథ్యంలో రాసిన కవిత )