Bluepadమూర్ఖుడు
Bluepad

మూర్ఖుడు

కొప్పుల ప్రసాద్
కొప్పుల ప్రసాద్
13th Jun, 2020

Share



అంశం: మూర్ఖుడు

ఎంత చదువు చదివినా ఎన్ని విద్యలు నేర్చినా
మూర్ఖుడైన దుర్జనుని దూరంగానే ఉంచాలంటూ
సుభాషిత రత్నావళి శతకకర్త భర్తృహరి మహాకవి చెప్పగా, తెలుగులో ఏనుగు లక్ష్మణ కవి గారు చక్కని పద్యములో వివరించారు.

పద్యం:

విద్యచే భూషితుండయి వెలుయిచున్న
దొడరి వర్జింపనగు జుమీ దుర్జనుండు
చారు మాణిక్య భూషిత శస్త మస్త
కంబు గల పన్నగము భయంకరము గాదె.

వివరణ: ఎంత గొప్ప చదువు చదివినా, విద్యచేత అలంకరించబడిన వాడైనా, ప్రకాశించే వాడైనా,
దుర్జనుడు లేదా దుర్మార్గుడైతే వాడిని దూరంగా పెట్టడమే మంచిది. వాడు ఎక్కడైనా,దుర్మార్గపు ఆలోచనతో మనకు కీడు చేసే ప్రయత్నమే చేస్తాడు.
అందుకే అంటారు. చదువుకోని మూర్ఖుని కంటే,
చదువుకున్న తెలివిగల మూర్ఖునితోనే ప్రమాదం ఎక్కువని. ఎలాగంటే, అందమైన మణి
శిరస్సుమీద ఉన్నప్పటికీ, పాము భయంకరమైనదే కదా! దానికి మనము దూరంగా ఉండడమే మంచిది కదా!

చదువుకున్న వాడు గొప్పవాడు అంటారు. కానీ
చదువుకున్న మూర్ఖుడు ఎప్పటికైనా ప్రమాదకరమే,
తాను నేర్చుకున్న విద్యలన్నీ, సమాజం అభివృద్ధికి
చాలా ఉపయోగిస్తే బాగుంటుంది. కానీ తన నీచ స్వభావముతో... సంఘానికి ద్రోహం చేసే, అంటే చెడు కలిగించే పనులు ఎక్కువ చేస్తూ ఉంటారు.

రావణాసురుడు అన్ని విద్యలలో ఆరితేరినప్పటికీ,
తన గర్వము చేత, అందరినీ బాధించేవాడు.
మూర్ఖంగా ప్రవర్తించేవాడు. గొప్ప బ్రాహ్మణ వంశంలో పుట్టి, ఎన్నో విద్యలు నేర్చి, సకల విద్యా పారంగతుడైనా, అహంకారముతో, మూర్ఖంగా సీతను ఎత్తుకొచ్చి, మూర్ఖంగా ప్రవర్తించే అతని మూర్ఖత్వాన్ని చూసి, తమ్ముడైన విభీషణుడు,
అన్నను వదలి రాముని పక్షము చేరడానికి కారణం తన అన్న మూర్ఖత్వమే. ఎవరు చెప్పినా వినక పోవడమే. రావణుడు విద్యావంతుడైననూ, మూర్ఖుడిగానే అనుకుంటాం. విజ్ఞులైన స్నేహితులు,బంధువులు
అతనికి దూరంగానే ఉన్నారు.

ఎంత చదువు చదివినా విజ్ఞత లేకపోతే, ఆ చదువు
వల్ల ప్రయోజనం ఉండదు. జ్ఞానవంతుడు అని చెప్పుకునే మూర్ఖుడిని ఎప్పటికీ నమ్మకూడదు.
దగ్గరకు రానీయకూడదు. వాడిని ఎప్పుడూ నమ్మకూడదు. వాడివల్ల ఎప్పుడైనా మనకు కీడు జరిగే అవకాశమే ఉంటుంది తప్ప మేలు జరగటం ఇసుమంతైనా ఉండదు.

కొప్పుల ప్రసాద్
నంద్యాల

21 

Share


కొప్పుల ప్రసాద్
Written by
కొప్పుల ప్రసాద్

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad