Bluepadచదువు
Bluepad

చదువు

కొప్పుల ప్రసాద్
కొప్పుల ప్రసాద్
11th Jun, 2020

Share



అంశం: చదువు

ఆటపాటలతో హాయిగా చదవాలని, అలా చదువుతే చదువు సులభంగా వస్తుందని, ఆటల వల్ల ఆరోగ్యం లభిస్తుందని తెలుగు బాల శతకం రచయిత
గుమ్మా సాంబశివరావు తన శతక పద్యంలో చెప్పాడు.

పద్యం:
ఆట పాట తోడ హాయిగా చదువంగ
చదువు తలలకెక్కు ఛాత్రులకును
ఆట పాట లెప్పుడు ఆరోగ్యం అందించు
తెలిసి మెలగ మేలు తెలుగుబాల.

వివరణ: పిల్లలు చదివే చదువు ఆడుతూ పాడుతూ
హాయిగా చదువుకుంటే ఆ చదివిన చదువు తల లోకి ప్రవేశిస్తుంది అంటే బుద్ధి వస్తుంది. ఆట పాటల
వలన పిల్లలకు మంచి ఆరోగ్యం అందుతోంది.

ఈ నాటి విద్యా విధానం చూస్తే భయం వేస్తుంది.
పిల్లలకు ఆటలు లేవు, పాటలు లేవు. కొన్ని విద్యా సంస్థల్లో కనీసం ఆటస్థలాలు కూడా లేవు. పిల్లలను ఎప్పుడు చదువు చదువు అంటూ తోపుడు కార్యక్రమమే తప్ప. ఆడుతూ పాడుతూ చెప్పే
కాలము లేదు. కొన్ని స్కూళ్ళు ఏ మాత్రం
ఆటలకు సమయం కేటాయించడం లేదు. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలన్నా, మానసికంగా ఎదగాలన్నా ఆటలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. విద్యార్థులకు నాయకత్వలక్షణాలను ఆటలే అందిస్తాయి. మనోధైర్యాన్ని కలిగిస్తాయి. ఆటలో ఓడిపోయినప్పుడు ఎలా గెలవాలో నేర్పిస్తాయి. జీవితంలో వచ్చే ఒడిదుడుకులు తట్టుకుని నిలబడగలిగే శక్తి ఆటలు నేర్పుతాయి. ఆటల వల్ల దేహదారుఢ్యం ఏర్పడుతుంది. వ్యాయామం చేయడం వల్ల చక్కటి శరీరం ఏర్పడుతుంది. భవిష్యత్తులో అనేక ఉద్యోగాలకు ముఖ్యంగా సైన్యంలో చేరడానికి, రక్షకభటులు గా ఎన్నిక కావడానికి, ఆటల కోటాలో
ఉద్యోగం సంపాదించడానికి ఎంతో ఉపయోగపడతాయి ఆటలు.

ముఖ్యంగా పిల్లలు నేడు పాఠశాలలకు పోవాలంటే భయపడుతున్నారు. చిన్నపిల్లలకు బడి ఏదో భూతం మాద్రి కనిపిస్తుంది. అదే వారికి ఆడుతూ పాడుతూ చదివు చెప్పితే ఇష్టంగా పోతారు ఇష్టంగా నేర్చుకుంటారు కష్టమనేది అనిపించదు. బడి అనే భయం పోతుంది. చేరిన పిల్లలకు రాయడం రుద్దడం కాకుండా. వారిని ఆటల ద్వారా లేదా పాటల ద్వారా విజ్ఞానాన్ని అందించి నేర్పే ప్రయత్నం చేయాలి. పిల్లలు చదువును
ఇష్టపడే విధంగా చేస్తే వారు భవిష్యత్తులో ఆ చదువు అలా కొనసాగించి ఉన్నతస్థితికి చేరుకునే అవకాశం ఉంది. వాడు చిన్నప్పుడే భయపడి పోతే,
చదువును మధ్యలోనే ఆపేస్తే వాడి జీవితం భారమై పోతుంది.

నేటి స్కూలు విద్యార్థులను ర్యాంకర్స్ గానే చూస్తున్నారు తప్ప వారి మనో వికాసానికి,
వారి శారీరక వికాసానికి ఏ మాత్రం కృషి చేయడం లేదు. ఎప్పుడూ పుస్తకాలు ముందరేసి చదువు చదువు ర్యాంకు ర్యాంకు అంటారే తప్ప వేరే ఏ విషయాలనూ వారికి వివరించరు చెప్పరు.
విద్యార్థులకు కూడా ఒక బండ మాదిరి తయారైతారే తప్ప. లోకజ్ఞానం ఏమాత్రము అబ్బదు.
నలుగురిలో ఎలా మాట్లాడాలో ఎలా మెలగాలో ఇవన్నీ ఒక ఆట పాటల ద్వారానే వస్తాయి. ఏకాగ్రత వస్తుంది. విజయాన్ని సాధించి పెడుతుంది. చదువులో ర్యాంకు సాధించవచ్చు
కానీ జీవితంలో తను ఓడిపోవచ్చు. కాబట్టి
మన పిల్లలకు చదువుతోపాటు ఆట పాటలను కూడా నేర్పుదాం. "భావితరాలకు వారసత్వంగా
ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇద్దాం"

కొప్పుల ప్రసాద్
నంద్యాల

20 

Share


కొప్పుల ప్రసాద్
Written by
కొప్పుల ప్రసాద్

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad