Bluepadసాహిత్యానికి మకుటం శతకం
Bluepad

సాహిత్యానికి మకుటం శతకం

కొప్పుల ప్రసాద్
కొప్పుల ప్రసాద్
10th Jun, 2020

Share


అంశం: శతకము


తెలుగు సాహిత్యములో ఎన్నో ప్రక్రియలు ఉన్నా
శతకానికి ప్రత్యేక స్థానం ఉన్నది. ఒక ప్రక్రియ అయినా ఇతిహాసము, కావ్యము, ప్రబంధము,
ద్విపదతో పాటు శతకప్రక్రియ విరాజిల్లింది.
ఆధునిక కావ్యాలలో ప్రాచీన ప్రక్రియలు కొంతవరకు దూరమైనా, శతకము ఇప్పటికీ నిత్య నూతనంగా
వర్ధిల్లుతోంది, కారణం శతక పద్యాలు రాని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మిగతా కావ్యాలలో పద్యాలు రాకపోయినా, నేటికి పిల్లలు శతక పద్యాలు ప్రతి ఒక్కరి నోటి లో నాలుకలపై తాండవం చేస్తూనే ఉన్నాయి. అక్కడక్కడ కొత్త శతకాలు రాస్తూనే ఉన్నారు.
శతకాలు ముఖ్యంగా పద్యాల రూపంలోనే ఉంటాయి. వృత్తాలలో గాని జాతులలో గాని ఉపజాతులలో గానీ రాస్తూ ఉంటారు.
"ఆంధ్ర వాఙ్మయమున శాఖోపశాఖలుగా వికాసమునొందిన కావ్య ప్రక్రియలలో శతకమొకటి. ప్రాకృత, సంస్కృత ప్రక్రియలననుసరించియే తెలుగు శతక రచనమారంభమై, కాలక్రమమున విశిష్ట సాహితీ ప్రక్రియగా రూపొందినది. తెలుగులో పన్నెండో శతాబ్దంలో శతకమావిర్భవించినది. ఈ ఎనిమిది వందల యేండ్లలో తెలుగు శతకం శాఖోపశాఖలుగా విస్తరిల్లి స్వరూపంలోనూ స్వభావంలో ఎంతో మార్పునొందినది. భారతీయ భాషలలో ఎందులోనూ శతకప్రక్రియ తెలుగులో వలె బహుముఖ వికాసము పొంది వైశిష్ట్యమునొందలేదు. నేటికీ ఏ మూలనో ఒకచోట శతకం వెలువడుతూనే ఉన్నది. సజీవ స్రవంతివలె అవిచ్ఛిన్నంగా సాగుతూ వస్తున్నది శతకమే" అని శతకం పై పరిశోధన చేసిన ఆచార్య కె. గోపాలకృష్ణరావు గారి అభిప్రాయం.

శతక లక్షణాలలో
ముఖ్యమైనది సంఖ్యా నియమము. శతకము అంటే నూరు అని అర్థం అయినా నూటికి పైగా పద్యాలు కూడా ఉంటాయి. అలాగే మరొక లక్షణం. ఏ పద్యం యొక్క భావం ఆ పద్యము తోనే ముగియును. పైపద్యానికి క్రింది పద్యానికి సంబంధం ఉండదు. వీటిని ముక్తకాలు అంటారు. మరొక ముఖ్యమైన లక్షణం. పద్యానికీ చివరలో ఒక పదము గానీ, పదాలుగానీ, పూర్తి చరణము గానీ ఉండటం ఆనవాయితీ. ఇది ఆ రచయిత సంతకం లాంటిది. దీనిని మకుటము అంటారు. ఉదాహరణకు "విశ్వదాభిరామ వినురవేమ" అనునది వేమన శతకమునకు మకుటము. అలాగే సుమతీ అనునది సుమతీ శతకమునకు మకుటము, అలాగే వేంకటేశ్వరా, దాశరథీ భాస్కర, శ్రీకాళహస్తీశ్వర, నార్ల వారి మాట, కుమారి, కుమార ఇలా వందల మకుటముల శతకాలు ఉన్నాయి.

తెలుగులో శతక వాఙ్మయం పన్నెండవ శతాబ్దంలో ప్రారంభమైంది. క్రీ.శ.1160-70 ఉన్నట్లు తెలుస్తోంది.
మల్లికార్జున పండితుడు మొట్టమొదటి శతక కర్త.
అతను" శివతత్త్వసారం"మొదటి శతకమని అభిప్రాయపడుతున్నారు.12వ శతాబ్దానికి పూర్వమే శతక బీజాలు పడ్డాయని పరిశోధకుల అభిప్రాయం.
నన్నెచోడుని కుమారసంభవము లో కూడా"దారిద్య విద్రావణ"అనే మకుటంతో తొమ్మిది పద్యాలు ఉన్నాయన్నారు. శతకరచనకు ఇది బీజ అభిప్రాయాలని నిర్ణయం. పాల్కురికి సోమన శతకరచనకి గౌరవం, ప్రాచుర్యం కల్పించారు. ఇతను రచించిన వృషాధిప శతకం సంపూర్ణ శతక లక్షణాలు కలది. మల్లికార్జున పండితారాధ్యుడు, పాల్కురికి సోమన, అన్నమయ్యల్ని శతక కవిత్రయం గా పేర్కొంటారు.
ముఖ్యంగా శతకాలలో అనేక రకాలుగా వర్గీకరించారు. భక్తి శతకాలు, వ్యాజస్తుతి శతకాలు, వేదాంత శతకాలు, నీతి శతకాలు, అధిక్షేప శతకాలు, శృంగార శతకాలు, హాస్య శతకాలు, జీవిత చరిత్ర శతకాలు, సమస్య శతకాలు, అనువాద శతకాలు, చాటు శతకాలు, చారిత్రక శతకాలు, స్యీయ చారిత్రక ప్రాతిపాదిక శతకాలు, కథా శతకాలు, నిఘంటు శతకాలు, ఇలా వర్గీకరించడం జరిగింది.

13వ శతాబ్దం నాటి సుమతి శతకం, 17వ శతాబ్దానికి చెందిన వేమన శతకం ఒక ఎత్తు, శతకాన్ని సామాజిక పరం చేసి సాంఘిక చైతన్యానికి దోహదపడేలా ఈ శతకాలు మార్గదర్శకాలయ్యాయి.
అలాగే కవి చౌడప్ప, కూచిమంచి తిమ్మకవి, అడిదం సూరకవి ఇదే మార్గములో పయనించి అధిక్షేప ధోరణికి ప్రచారం కల్పించారు. వేమన శతకాలు ఈనాటి పిల్లలకు పెద్దలకు ఆణిముత్యాలు అనే చెప్పాలి. ఇతని శతకాలలోని నీతులు ఆటవెలది పద్యాలలో అద్భుతంగా చెప్పారు. వేమనవి తీవ్రమైన భావములు. అతని రచనలోని భాష మరియు భావం రెండూ ఒకదానికొకటి పందెం వేసుకొని , హృదయం నుండి పైకి వచ్చినట్లు చందస్సు యతి ప్రాసలతో ఆటవెలదిలో అద్భుతమైన పద్యాలను రాయడం జరిగింది. అలాగే అచ్చతెలుగు పదాలు వేమన పద్యాలలో కుప్పలుగా పోసినట్లు కనిపిస్తాయి.
సి.పి.బ్రౌన్ పుణ్యమా అంటూ తెలుగు నేలంతా వికసించి, అద్భుత ఫలితాలను ఇస్తున్నాయి.

అలాగే ఆధునిక కాలంలో శతక ప్రక్రియ ఏమాత్రం ఆదరణ తగ్గలేదు. రాజకీయపరమైన సాంఘికపరమైన శతకాలు ఎక్కువగా వస్తూనే ఉన్నాయి. శ్రీ శ్రీ సిరి మువ్వ శతకం, ఈ తరహాలో మొదటిది. నార్ల వారి మాట దాశరధి శతకం బోయి భీమన్న పిల్లీ శతకం పేర్కొనదగినవి.
పేరడీగా రాయబడిన శతకాలలో, బేతవోలు రామబ్రహ్మం అభినవ వేమన శతకం పేర్కొనదగినది.

ఈ శతకాలు విద్యార్థులకు నేర్పడం ద్వారా, వారికి నైతిక విలువలు తెలుప వచ్చును, వ్యక్తిత్వ వికాసానికి కూడా ఈ శతక పద్యాలు ఎంతో ఉపయోగపడతాయి. చిన్నప్పుడు పిల్లలకు ఈ శతక పద్యాలు నేర్పడం ద్వారా, వారికి ఉచ్ఛారణ
చక్కగా వస్తుంది. నత్తిగా మాట్లాడే పిల్లలకు శతకాలు నేర్పితే వారు చక్కగా మాట్లాడగలుగుతున్నారు. ఈ శతకాలు నేటి సమాజానికి కూడా ఎంతో ఉపయోగపడతాయి. ఏది మంచి? ఏది చెడు? ఎలా మెలగాలి? దుర్జనుడు ఎవడు? సజ్జనుడు ఎవడు? స్నేహం అంటే ఎలా ఉండాలి? నీతి మార్గంలో ఎలా ప్రయత్నించాలి? శత్రువులను ఎలా మెలగాలి, మిత్రులతో ఎలా ప్రవర్తించాలి, స్ధాన బలము ఏమిటి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, విద్య యొక్క ప్రత్యేకత ఏమిటి, పిసినారి తత్వం ఎలాంటిది,
సత్యం అంటే ఏమిటి, భక్తి అంటే ఏమిటి, మానవుడు ఎలా ప్రవర్తించాలి ఇలా ఎన్నో నీతి వైరాగ్య భక్తి విషయాలు మనకు నిరంతరము తెలియజేస్తూనే ఉంటాయి. అన్ని కాలాలకు తగినట్టుగా ఈ శతకాలు వర్తిస్తాయి . అందుకే నేటి విద్యా విధానంలో కూడా తెలుగు వాచకంలో ఒకటో తరగతి నుండి పదవ తరగతి వరకు శతకాల లోని పద్యాలను పిల్లలకు నేర్పించడం జరుగుతుంది.
ఎన్ని ప్రక్రియలు వచ్చిపోయినా శతకప్రక్రియ శాశ్వతంగా నిలబడిపోయింది. ఇప్పటికీ శతకాలు వస్తూనే ఉన్నాయి. రాస్తూనే ఉన్నారు. అందుకే తెలుగు సాహిత్యములో మకుటం అలాంటివి శతకాలు.
కొప్పుల ప్రసాద్
నంద్యాల

22 

Share


కొప్పుల ప్రసాద్
Written by
కొప్పుల ప్రసాద్

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad