Bluepad | Bluepad
Bluepad
రెండు లాభాలు
డా.ఎం.హరికిషన్
9th Jun, 2020

Share

*రెండు లాభాలు - హాస్య కథ పునఃకథనం:డా.ఎం.హరికిషన్*
**************************
శివరాంకి సిగరెట్లు అధికంగా కాల్చే అలవాటుంది. అలవాటంటే అలా ఇలా కాదు. స్నానం చేసేటపుడు, భోజనం చేసేటపుడు, నిద్రపోయేటపుడు తప్ప మిగతా సమయంలో ఎప్పుడు చూసిన నోట్లో సిగరెట్ ఉండి పొగ రింగులు రింగులుగా గాల్లో తేలుతూ ఉండేది. ఆ అలవాటు వల్ల అటు తోటివాళ్లకి, ఇటు ఇంట్లో భార్యాపిల్లలకి తెగ ఇబ్బంది కలిగేది. వాళ్ళు ఎంత చెప్పినా ఆ అలవాటు మాత్రం మానేవాడు కాదు శివరాం.

ఇంట్లో భార్య అయితే ఆ పాడు సిగరెట్లు తాగొద్దని రోజూ ఎంతో గొడవ చేసేది. అవి తాగడం వల్ల ఊపిరితిత్తులు పాడవుతాయని, గుండె పోటు, క్యాన్సరు వంటి ప్రమాదకరమైన జబ్బులు వస్తాయని పోరు పెట్టేది. అలాంటి జబ్బులు ఏవో ఈ పాటికి వచ్చే ఉంటాయని కూడ గోలచేసేది.

అలా ఉండగా ఒక రోజు భార్య గోల పడలేక పరీక్ష చేయించుకుందామని డాక్టరు దగ్గరికి వెళ్లాడు శివరాం. డాక్టర్ గారితో “డాక్టరు గారూ నాకు సిగరెట్టు కాల్చే అలవాటుంది. ఎంత ప్రయత్నించినా మానలేక పోతున్నాను. మానెయ్యమని మా వాళ్లు తెగ గోల చేస్తున్నారు. అయినా నాదొక సందేహం. ఇవి కాల్చడం వల్ల నష్టాలేగాని లాభాలు ఏమీ లేవా? అనడిగాడు. డాక్టర్ చిరునవ్వు నవ్వి “ఎవరన్నారయ్యా లేవని సిగరెట్లు కాల్చడం వల్ల రెండు లాభాలు కూడా ఉన్నాయి" అన్నారు. “అలాగా అవేంటో కాస్త చెప్పండి. ఇంటికెళ్లి నా పెళ్ళాం పిల్లలకు చెబుతాను" సంతోషంగా అడిగాడు శివరాం. "ఆ లాభాలు ఏంటంటే ఒకటి మీ ఇంటికి దొంగలురారు. ఇక రెండోది మీకు ముసలితనం రాదు" అని చెప్పాడు డాక్టర్.

“అదెట్లాగండి?" అంటూ ఆశ్చర్యంగా ఆనందంగా అడిగాడు శివరాం.

"ఏముంది సిగరెట్లు కాల్చి కాల్చి ఊపిరితిత్తులు పాడై రాత్రంతా నిద్రపోకుండా దగ్గుతూ ఉంటావు గదా, దాంతో ఇంట్లో ఎవరో మెలకువగానే ఉన్నారని మీ ఇంటి వైపు దొంగలురారు" అన్నాడు.

“మరి ముసలితనంరాదు అన్నారు గదా అదెలా సాధ్యం" అడిగాడు శివరాం. “ముసలితనం ఎలా వస్తుంది. అలా దగ్గుతూ... దగ్గుతూ మద్యలోనే నువ్వు చస్తావుగదా" నిదానంగా చెప్పాడు డాక్టర్.

అంతే....

ఆ మాటకు శివరాంకి దిమ్మ తిరిగింది. అప్పటినుండి సిగరెట్లు తాగడం మానేశాడు
**************************
డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
**************************

10 

Share


Written by
డా.ఎం.హరికిషన్

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad