Bluepadస్మృతి చిహ్నం-3వ భాగం
Bluepad

స్మృతి చిహ్నం-3వ భాగం

D
D. N. Subramanyam
8th Jun, 2020

Share

స్మృతి చిహ్నం-3వ భాగము ------ ఆనందమో...ఉద్వేగమో...ఏదో తెలియని భావపరంపర అభిరామ్ ను ఆవరించి 'థాంక్యూ మాధవి' అంటూ మాధవి చేతిని గట్టిగా నొక్కాడు.
'థాంక్స్ ఎందుకు ....' అంటూ అభిరామ్ వంక చూసింది మాధవి.
అతని కళ్ళ నిండా నీళ్ళు!
'అభి... ఏమిటిది చిన్న పిల్లాడిలా... ఏడుస్తున్నావెందుకు?' ఆశ్చర్యంగా అంది మాధవి
'ఏడుపు కాదు మాధవీ.. నీలాంటి అమ్మాయి నాకు తోడుగా వస్తున్నందుకు ఆనందం... సంతోషం!! మనం ఒక్కటయ్యేదాకా నువ్వు ఓపిక పడితే చాలు...జీవితపు చివరి క్షణం దాకా నువ్వు సంతోషంగా ఉండేలా నేను చూసుకుంటాను' గద్గద స్వరంతో అన్నాడు అభిరామ్
'సరే... సరే... ముందు నీ ఫోటో ఇచ్చి ఓ నవ్వు విసురు... చూడలేక చచ్చిపోతున్నా...' అల్లరిగా అతని జేబులోని పర్సు తీసుకుంది మాధవి.
అందులో అతని ఫోటోలుంటే ఒకటి తీసుకుందామనుకున్న మాధవి, పర్సులో తన ఫోటో ఉండడం చూసి ఆశ్చర్యపోయింది
' సారీ  ... మొన్న నీ నోట్సులో ఆ ఫోటో కనిపిస్తే తీసుకున్నా' నసుగుతూ అంటున్న అభిరామ్ ను చూస్తూ 'కనిపిస్తే ... అడక్కుండా తీసుకోవడమేనా?' కోపం నటిస్తూ అంది మాధవి.
'సరే ...సరే... రేపు వచ్చేటపుడు నీ ఫోటో తీసుకు రా.. మరచిపోకు.  ఇక వెళ్దామా" అంటూ లేచింది మాధవి
"నువ్వెళ్ళు... నేను కాసేపు ఇక్కడే కూర్చుని వెడతా' అన్నాడు అభిరామ్
'సరే... తొందరగా ఇంటికి వెళ్ళు. ఎగ్జామ్స్ కు బాగా చదువుకో. మరి కలుస్తా' అంటూ చేయూపుతూ వెళ్తున్న మాధవిని అలా చూస్తూ ఉండి పోయాడు అభిరామ్.
***     ***     ***     ***   ***   ****
ఆరోజు పొద్దున మాధవి ఉత్తరంలోని అంశాలు,  అక్కడ ఆమెతో గడిపిన క్షణాలు అభిరామ్ ని ఓ కుదుపు కుదిపాయి. ఎలాంటి పరిస్థితిలో కూడా ఆమె స్నేహం, ప్రేమ తనకు దూరం కాకుండా ఉండేలా వరమివ్వమని ఆ పరమశివుని ప్రార్థించిన తీరు తనకు ఆశ్చర్యం కల్గించింది. ఎందుకంటే ఇంతవరకు తానెన్నడూ తన గురించి దేవుడిని కోరలేదు! ఎపుడూ తన బంధుమిత్రుల క్షేమం కోసమే ప్రార్థించే తాను, ఇలా చేయడం అభద్రతాభావం తన మదిని ఆవరించడం వల్లనేనా? అని అనిపించిందాతనికి.
ఏదైనా ఒక అంశం మనకు అపురూపమైందని అనిపించినపుడు... అభద్రతాభావం దానంతట అదే మనల్ని ఆవరిస్తుందేమోననుకుని నవ్వుకున్నాడు. కానీ, నిజంగానే తనకు మాధవీవియోగం ఎదురవబోతున్నదని పసిగట్టలేకపోయాడు!
మర్నాడు యోగా క్లాసుకు వెళ్లేపుడు మాధవికిద్దామని తన ఫోటో ఒకటి తాను చదువుతున్న నోట్సులో పెట్టుకున్నాడు.
***.             ***.         ***.      ***
ఆ రోజుతో డిగ్రీ పరీక్షలు పూర్తయ్యాయి.
సాయంత్రం కలుద్దామని చెబితే శివాలయంలో మాధవి కోసం వేచి చూస్తూ ఉన్నాడు అభిరామ్.
ఇంతలో మాధవి వచ్చింది.  వస్తువస్తూనే రుసరుసలాడుతూ తన హ్యాండ్ బ్యాగులో నుంచి ఫోటో తీసి అభిరామ్ చేతిలో పెట్టేసింది
'ఏమయింది మాధవి?' ఆందోళనగా అడిగాడు అభిరామ్
'ఓ ఫోటో ఇవ్వవయ్యా బాబూ అంటే ... పాలు తాగే పిల్లాడి ఫోటో ఇస్తావా?' అభిరామ్ పక్కన కూర్చుంటూ కోపంగా అంది.
'పాలు తాగేటప్పటిదేమీ కాదు. పదో తరగతి పరీక్షల కోసం తీసుకున్న ఫోటో అది...' ఉడుక్కుంటూ అన్నాడు అభిరామ్
'రీసెంట్ గా దిగిన ఫోటో ఇస్తే నీ సొమ్మేం పోతుంది? ఆ ఫోటో చూస్తే నా అభి లాగా అనిపించడంలేదు. ఎవరో చిన్న పిల్లాడిని ముద్దాడుతున్నట్టుగా ఉంది' అని అంటూ నాలుక కరుచుకుంటున్న మాధవి వైపు కొంటెగా చూస్తూ, తన ఫోటోను చేతిలోకి తీసుకుని తేరిపారా చూడసాగాడు అభిరామ్
'ఏమిటలా చూస్తున్నావ్?' అయోమయంగా అడిగింది మాధవి
'ఏమీ లేదు... ఫోటోపై నీ పెదాల ముద్రలు ఏమైనా కనిపిస్తాయేమోనని...' అన్నాడు అభిరామ్
'ఛీ... కొంటె పిల్లాడా' అంటూ అభిరామ్ ను చిన్నగా కొట్టింది మాధవి
పెదాల ముద్రలు కనిపించలేదు కానీ...   ఫోటోపై పెన్సిల్ తో దిద్దిన గుర్తులు! కనుల పైనా, కనుబొమ్మల పైనా , ముక్కు చుట్టూ పెన్సిల్ తో దిద్దిన ఆనవాళ్లు! అలా చూస్తూనే ఉన్నాడు ఇంకా ఏమైనా కనిపిస్తాయేమోనని!
అభిరామ్ వాలకం చూస్తుంటే తననింకా ఆట పట్టిస్తాడనుకున్న మాధవి సీరియస్ గా అయిపోయింది
"ఏమీ లేదు అభి... ఆ  ఫోటో నా దగ్గరుంటే ఓ చిన్నపిల్లాడున్న ఫీలింగే తప్ప నువ్వున్నట్లు అనిపించడం లేదు.నన్నర్థం చేసుకో ప్లీజ్' దీనంగా అంది మాధవి
'సారీ మాధవీ ... నువ్వారోజు అడిగినపుడు నా దగ్గర రెడీగా ఉన్న ఫోటో ఇచ్చాను. నువ్విలా ఫీలవుతావని తెలుసు. అందుకే కొత్తగా ఫోటో తీసుకున్నాను ఇదిగో' అంటూ మరో ఫోటో ఇచ్చాడు అభిరామ్
'థాంక్యూ' అంటూ ఫోటోతో పాటు అభిరామ్ చేతిని తన చేతిలోకి తీసుకుని ఏదో ఆలోచనలో మునిగిపోయింది మాధవి
'మాధవీ... ఏమయింది?' అభిరామ్ పిలుపుతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది
'అబ్బే...ఏమీ లేదు... ఈ ఉంగరం బావుందా?' అంటూ తన వేలికి ఉన్న మరకతమణి పొదిగిన ఉంగరాన్ని తీసి అభిరామ్ కిచ్చింది
'బాగుంది. అయినా చాలా రోజుల నుంచి నేను చూస్తూనే ఉన్నాను కదా! ఈరోజు కొత్తగా అడుగుతున్నావేం' అంటూ పరిశీలనగా చూసి తిరిగి మాధవికివ్వబోయాడు అభిరామ్
'నువ్వే తొడుగు...' అంటూ చేతిని ముందుకు చాచింది.
'సరే' అంటూ అభిరామ్ ఆమె చేతికి  ఆ ఉంగరాన్ని తొడిగాడు
'ఇలా ఓ అబ్బాయి ఓ అమ్మాయి చేతికి ఉంగరం తొడిగితే ఏమిటో తెలుసా అభి?'  కొంటెగా చూస్తూ అడిగిందామె
'తెలుసు మాధవి! కానీ నువ్వు బయటకు ఎంత నవ్వుతూ మాటాడుతూ వున్నా, నీ మనసులో ఏదో సంఘర్షణ జరుగుతున్న దనిపిస్తోంది. ఏమిటో చెప్పొచ్చు కదా?!' ఆందోళనగా అడిగాడు అభిరామ్
అభిరామ్ కళ్ళలోకి చూస్తూ అతని భుజంపై తల వాల్చింది  మాధవి.
"ఏమైంది మాధవి" అడిగాడు అభిరామ్
"ఏమీ లేదు... అభీ.. ఏవేవో ఆలోచనలతో రోజురోజుకీ "క్రాక్ అయిపోతున్నాను" దిగులుగా అంది మాధవి.
" పరీక్షలు అయిపోయాయిగా... నేను ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటాను. ఈలోగా మా అక్కయ్య పెళ్లి కూడా అయిపోతుంది. కొద్దికాలం ఓపిక పట్టు. తొందర్లోనే మనం సెటిల్ అయిపోతాం." సర్దిచెబుతున్నట్లుగా అన్నాడు అభిరామ్
"నీ చేతి వేళ్ళు భలే ఉంటాయి ఆడపిల్లల్లాగా ..." మాట మారుస్తూ అంది మాధవి.
మౌనంగా ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు అభిరామ్.
"నీ వేళ్లు పొడవుగా బాగున్నాయి కానీ ... వేళ్ల మధ్య సందులున్నాయి కదూ... అలా ఉంటే మంచి అమ్మాయి, భార్యగా వస్తుందట!" అతడిని మంచి మూడ్ లోకి తీసుకుపోవాలని అందామె.
" అంతా అబద్ధం .‌.. నా కాబోయే భార్య, పరమ గయ్యాళి " ఉడికిస్తున్నట్లుగా నవ్వుతూ అన్నాడు అభిరామ్.
" హమ్మయ్య ... మా అభి నవ్వాడోచ్...."  అంటూ చిన్నగా చప్పట్లు కొట్టింది మాధవి.
"మన పెళ్లి అయ్యాక ... మంచి మంచి వంటలు చేసి, నీతో బాగా తినిపిస్తాను. అప్పుడు ఒళ్ళు చేసి వేళ్ళ మధ్య గ్యాప్ కూడా కవర్ అవుతుంది లే" అంది మాధవి.
"వేళ్ళ సంగతి సరే .... ఒళ్ళు చేస్తే నీకు ఇబ్బందేమో..." కొంటెగా అన్నాడు అభిరామ్.
" నాకేం ఇబ్బంది? " అంటూ అయోమయంగా చూసిన మాధవికి,  ఏదో స్ఫురించి... "ఛీ...."  అంటూ చిన్నగా కొట్టి నవ్వింది మాధవి.
ఆమె నవ్వులో అభిరామ్ గొంతు కలిపాడు.
*** ‌.          ***.        ***
కాలం గడిచిపోతోంది.
మాధవి ఎం.కామ్.లో చేరింది.
అభిరామ్ కు ఓ తెలుగు దినపత్రికలో సబ్ ఎడిటర్ గా ఉద్యోగం వచ్చింది!
యోగా శిక్షణాలయం  రజతోత్సవాల సందర్భంగా నిర్వహించిన పోటీలలో అభిరామ్, మాధవిలు మొదటి రెండు స్థానాలలో నిలిచారు.
ఆ సందర్భంగా అభిరామ్ కు శివపార్వతుల విగ్రహం,  మాధవికి దీపపు కుందులు బహుమతిగా రావడం.... అది జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా అందుకోవడం.. అభిరామ్ కు గొప్పగానే కాక, ఓ శుభశకునంలా అనిపించింది.
***          ***.        ***
ఓ రోజు...."అభీ" అంటూ మాధవి వచ్చి గట్టిగా వాటేసుకొని ఏడ్వసాగింది.
" ఏమైంది మాధవి? ఎందుకలా ఏడుస్తున్నావు? ఆందోళనగా అడిగాడు అభిరామ్.
"అబ్బే ...ఏమీ లేదు.."అంటూ కళ్ళు తుడుచుకుంది మాధవి.
" ఏం జరిగింది మాధవీ?  ఎప్పుడూ లేనిది ఇలా ఏడ్చేసావు. నాకు చాలా టెన్షన్ గా ఉంది. కారణం ఏమిటో  చెబితే కదా తెలిసేది..." అనునయంగా అన్నాడు అభిరామ్.
మౌనంగా ఉండిపోయింది మాధవి.
ఆ విషయమై మరిక ఒత్తిడి చేయడం ఎందుకు .. మెల్లిగా తనే చెబుతుంది లెమ్మని మిన్నకుండిపోయాడు అభిరామ్
హఠాత్తుగా.... "అభీ... నాకు సుమంగళిగా చనిపోవాలని ఉంది" అంది మాధవి.
"అదేమిటి మాధవి... మన జీవితాలు ఇంకా మొదలే కాలేదు... అప్పుడే చావుల గురించి మాట్లాడుతున్నావు! అసలు ఏం జరిగింది మాధవీ?" ఆశ్చర్యంగా, ఆందోళనగా అడిగాడు అభిరామ్.
"ప్లీజ్ ఆ విషయం వదిలేయ్... అభి... నువ్వు మా అమ్మకు బాగా నచ్చావు.." మాట మారుస్తూ, అభిరామ్ చేతిని తన చేతిలోకి తీసుకుని అంది మాధవి.
"మీ అమ్మగారు నన్ను ఎక్కడ చూసారు?  నచ్చడానికి ..."అన్నాడు అభిరామ్.
"మొన్న యోగా సెంటర్ సిల్వర్ జూబిలీకి అమ్మను కూడా తీసుకు వచ్చాను.నువ్వు ప్రైజ్ తీసుకోవడానికి స్టేజి మీదికి వెళ్ళినప్పుడు ... నిన్ను అమ్మకు చూపించాను. నిన్ను ఒకసారి ఇంటికి తీసుకొని రమ్మంది. నీతో మాట్లాడాలిట‌..." అంది మాధవి.
"ఏం మాట్లాడాలిట..?" సంశయంగా  అడిగాడు అభిరామ్.
"ఎందుకంత భయపడతావు? రమ్మన్నప్పుడు రావచ్చుగా..." గోముగా అంది మాధవి.
"సరే... రేపు వస్తాను లే... అన్నాడు.
" రేపు కాదు... ఈ రోజే రాకూడదూ... ప్లీజ్ ..." అంది మాధవి.
"రేపయితే నాకు వీక్లీ ఆఫ్. అందుకని రేపు వస్తానన్నాను. సర్లే .. నేను ఓ గంట పర్మిషన్ తీసుకుని ఈ రోజే వస్తాలే..." అన్నాడు అభిరామ్
"మా అభి.... చో... చ్వీట్..." అభిరామ్ చెంపలు చిన్నగా లాగుతూ  ముద్దుగా అంది మాధవి.
" చో...చ్వీటా? అదేమిటబ్బా?" చెంపలు రుద్దుకుంటూ అయోమయంగా అన్నాడు అభిరామ్.
"నువ్వో బుద్దూవి. ప్రతిదీ వివరంగా చెప్పాలి..."అంటూ లేచింది మాధవి.
" బుద్దూ అంటే ..." అని అనబోతూ... మాధవి మొహం చూసి ఆ మాటల్ని మింగేసాడు అభిరామ్.
"ఛీ..పో...నేను వెళుతున్నా..." అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతున్న మాధవిని చూస్తూ "ఏమిటో ఈ అమ్మాయి... అప్పుడే ఏడుస్తుంది...అప్పుడే కేరింతలు కొడుతుంది..." అనుకుని రిలీఫ్ గా నిట్టూర్చాడు అభిరామ్.
***.     ***.      ***.    ***
మాధవితో చెప్పిన విధంగా అభిరామ్, మాధవి వాళ్ళ అమ్మ లలితను ఆ రోజు సాయంత్రం కలిసాడు. అభిరామ్ ను సాదరంగా ఆహ్వానించిదామె. మాధవికి అక్కలా కనిపిస్తున్న లలితను చూసి ఆశ్చర్యపోయాడు అభిరామ్.
ఒడ్డూ... పొడవూ... ముఖకవళికలు... అంతా అచ్చు మాధవి లానే ఉంది. చిన్న వయసులోనే వైధవ్యం పాలయిన ఆమెను చూసి, అభిరామ్ మనసు చివుక్కుమంది. మాధవి కాక ఇద్దరు మగ పిల్లలు ఇంకా చదువుకుంటూనే ఉన్నారు. వారికి విద్యాబుద్ధులు చెప్పించి పైకి తీసుకు రావలసిన బాధ్యత ఆమె పైనే ఉంది. అయినా సరే... ఆమె ఎలాంటి తొణుకూబెణుకూ లేకుండా ఒంటి చేత్తో కుటుంబాన్ని లాక్కు వస్తుండడాన్ని అభిరామ్ మెచ్చుకోకుండా ఉండలేక పోయాడు.
" బాబూ... మాధవికి ఎలాంటి భర్త వస్తాడోనని దిగులుగా ఉండేది. మీ గురించి మాధవి అంతా చెప్పింది. నేను కూడా మిమ్మల్ని గమనించాను. మీతో మా అమ్మాయి జీవితం బాగుంటుంది అన్న నమ్మకం కలిగింది చాలా సంతోషం బాబూ.." అంది లలిత.
"థాంక్సండీ.." ఒకింత మొహమాటంగా అన్నాడు అభిరామ్.
"మాధవి మీతో చెప్పే ఉంటుంది. వాళ్ళ నాన్న చనిపోయాక వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులలో పెళ్లి ఖర్చుల కోసం కొంత ఉంచేసి, మిగతా డబ్బు మీకు ఇస్తాను. అంతకన్నా ఎక్కువ ఇచ్చుకోలేము" నెమ్మదిగా చెప్పినా,  నిక్కచ్చిగా చెబుతున్న లలిత వంక ఇబ్బందిగా చూశాడు అభిరామ్.
" అయ్యో ... అదేమిటండీ అలా అంటారు? మీ అమ్మాయే నాకు పెద్ద బహుమతి. నాకే డబ్బులూ అవసరం లేదు. అవి మీ దగ్గరే ఉంచేసుకోండి. దేనికైనా ఉపయోగపడతాయి. అయినా ఇవన్నీ మా నాన్న గారితో మాట్లాడితే బాగుంటుంది కదూ ..." అన్నాడు అభిరామ్.
"మాధవిని చేసుకోబోయే వారు... ముందు మీతో మాట్లాడక, మీ వాళ్లతో మాట్లాడదామనుకున్నాను. అది సరే... మాధవి ఉద్యోగం చేయడం మీకు ఇష్టమేనా?" ఆరా తీస్తున్నట్లుగా అంది లలిత.
అభిరామ్ ధర్మ సంకటంలో పడ్డాడు. "ఉద్యోగం చేయడం ఇష్టమే" అంటే జీతం డబ్బుల కోసం ఆశపడుతున్నాడు అనుకుంటారు. లేదూ..."జాబ్ చేయడం ఇష్టం లేదంటే" పెళ్లి కాకముందే శాసిస్తున్నాడు అని అనుకుంటారేమో...! ఏం చెప్పాలో తెలియక ఆలోచిస్తూ వుండిపోయాడు.
" ఏం బాబూ... మాధవి ఉద్యోగం చేయడం మీకు ఇష్టమేనా?" మళ్లీ అడిగింది లలిత.
"అది మాధవి ఇష్టమండీ‌... ఆమెకు చేయాలని ఉంటే చేయనీయండి..‌‌ ఇందులో నా బలవంతం ఏమీ ఉండదు..." అన్నాడు అభిరామ్.
అలా కాసేపు మాట్లాడడం అయ్యాక,  లలిత దగ్గర సెలవు తీసుకుని వచ్చేశాడు అభిరామ్.
***.        ***.      ***.      ***
అభిరామ్ కు అంతా ఉక్కిరిబిక్కిరిగా ఉంది.
ఓవైపు మాధవి మాటలు... ఓవైపు ఆఫీసులో పని ఒత్తిడి... వారం రోజుల ట్రైనింగ్ అని హెడ్ ఆఫీస్ కు రావడం వల్ల ఇంటి దగ్గరి విషయాలు ఏమీ తెలియడం లేదు. మాధవిని కలిసి దాదాపు పది రోజులు కావస్తోంది. ఆరోజు మాధవి ఎందుకు ఏడ్చిందో, సుమంగళిగా చనిపోవాలని ఉంది అని ఎందుకు అందో  ఏమీ అర్థం కావడం లేదతనికి. ఎన్నిసార్లు అడిగినా మాట మారుస్తుందే కానీ ...ళవిషయం చెప్పడం లేదు.మాధవి వాళ్ళ ఇంట్లో ఏమైనా తర్జనభర్జనలు జరుగుతున్నాయా అన్న అనుమానం కలిగిందతనికి. ఆ విషయంలో స్పష్టత వస్తే తప్ప,  తన మనసు కుదుటపడేలా లేదనిపించి, అభిరామ్ మాధవికి ఓ లేఖ రాయాలనుకొని పెన్నూపేపరు తీసుకున్నాడు.
డియర్  మాధవీ...
మొన్న మనం కలిసినప్పుడు ఏడ్చావు.సుమంగళిగా చనిపోవాలని ఉందని... ఇంకా ఏమేమో అంటూ నన్ను భయపెడుతున్నావు. ఏం జరిగిందో నువ్వు చెబితేనే కదా నాకు తెలిసేది?
మనం ఒకరినొకరం అర్థం చేసుకున్నాం. పెద్దవాళ్ళు కూడా అభ్యంతరపెట్టడం లేదు. కలకాలం అరమరికలు లేకుండా జీవితం సాగించగలమన్న నమ్మకం నాకుంది.
ఆ రోజు శివాలయంలో నన్ను వదిలి, నువ్వు వెళ్ళాక నేను మళ్ళీ గుడిలోకి వెళ్లి ప్రార్థన చేశాను. ఏమని కోరుకున్నానో తెలుసా? ఎలాంటి పరిస్థితిలో కూడా నీ స్నేహం, ప్రేమ నాకు దూరం కాకుండా ఉండేలా వరం ఇవ్వమని దేవుడిని కోరుకున్నా! అలా ప్రార్థించిన తీరు... నాకు అమితమైన ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ... ఎప్పుడూ నేను నా వాళ్ల యోగక్షేమాల కోసం తప్ప నా కోసం ఏనాడు దేవుడిని ప్రార్థించింది లేదు. మొదటిసారిగా నా కోసం చేసిన ఆ ప్రార్థన ఫలిస్తుందన్న నమ్మకం నాకుంది.
ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో నాకు తెలియదు. కానీ నా మనసులో మాట నీకు చెప్పాలని ఉంది.
నేను కృష్ణుడిని అనుకుంటే... నాకు గోరుముద్దలు తినిపించిన నువ్వు నా 'యశోద'వు!
ముద్దుమురిపాలతో మురిపించి, కొంటె పనులతో కవ్వించి, నన్ను ప్రేమ సాగరంలో ఓలలాడించిన నా 'రాధ'వు!
నా కోపతాపాలు, అలకలు భరించి అనురాగాభిమానాలను పంచిన నా 'రుక్మిణి'వి!
నీ చేతలతో నన్ను బాధించి,  ఆపై నువ్వే అలిగి,  నన్ను సాధించిన నా 'సత్య'వి!
నా కష్టసుఖాల గురించి... మాన అవమానాల గురించి... నేను చెప్పే కబుర్లన్నీ ఓపిగ్గా విన్న నా 'సుధాముడి'వి!
నాకు ఏమైనా అయితే, పుట్టెడు దుఃఖంతో తల్లడిల్లి పోయిన నా 'బంగారు తల్లి'వి!
నీకేం చేస్తే... నీకేమి ఇస్తే ... నా రుణం తీరుతుంది మాధవీ?
సుమంగళిగా కనుమూయాలని ఉందని అంటున్నావు. నీ కోరికే నిజమై, నాకన్నా ముందే నువ్వీ లోకం వీడినా, నా కోసం వేచి చూడు... మరుజన్మలో నీ భార్యగా పుట్టి నీకు సేవ చేసి రుణం తీర్చుకుంటా.
ఇంకో సారి మన మధ్య చావుల గురించి ప్రస్తావన రాదని అనుకుంటున్నాను.
ఇక ఉంటాను.
పూర్తయిన ఆ ఉత్తరాన్ని ఓసారి ఆసాంతం చదివి, రేపు పొద్దునే పోస్ట్ చేయాలి అని అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు అభిరామ్! ----- (సశేషం)

18 

Share


D
Written by
D. N. Subramanyam

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad