Bluepad | Bluepad
Bluepad
స్మృతి చిహ్నం-2వ భాగం
D
D. N. Subramanyam
8th Jun, 2020

Share

స్మృతి చిహ్నం - 2వ భాగము dnsubramanyam717@gmail.com ----
'సర్లే అభి... కన్యాకుమారికి ఎప్పుడు తీసుకెళ్తావు?' అడిగింది మంజూష
'నీ ఇష్టం ... నువ్వు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు...' అన్నాడు అభిరామ్
ఓ రెండు నిమిషాలు ఆలోచించి మంజూష , తనతో పాటు తెచ్చుకున్న దద్దోజనం ఓ ప్లేటులో పెట్టి అభిరామ్ కు ఇచ్చి 'నువ్వు చెన్నైలో నాతో పాటు ఎయిర్ పోర్టుకు రా. అక్కడ మా ఆడపడుచు వాళ్ళమ్మాయికి సెండాఫ్ ఇచ్చి, కన్యాకుమారి వెళ్దాం. సుమారు ఓ రెండు గంటలు అవుతుందేమో. నీకు ఓ.కె కదా?' అడిగింది మంజూష
'దద్దోజనం సూపర్ గా ఉంది మంజూ' అంటున్న అభిరామ్ ను చురుగ్గా చూసిందామె.
అది గమనించిన అభిరామ్ చిన్నగా నవ్వుతూ 'ఓ.కె... ఓ.కె... అలాగే వెళ్దాం సరేనా' అన్నాడు
భోజనం సంగతి పూర్తి కాగానే ఇద్దరూ గుడ్ నైట్ చెప్పుకొని బెర్తుల పైకి చేరారు. పడుకోనైతే పడుకున్నారు కానీ, ఇద్దరిలో ఎవరికీ నిద్ర రాలేదు! ఇరువురి ఆలోచనలూ గతంలోకి వెళ్ళాయి.
****              ****          ****
వరంగల్ మహానగరం ఇప్పుడంటే మల్టీ ప్లెక్సులు, అపార్ట్ మెంట్లు, 'గేటెడ్ కమ్యూనిటీ'లు వగైరా వగైరాలతో ఆధునికత వెల్లివిరుస్తున్నది కానీ, అప్పటి కాలంలో ఓ మోస్తరు పట్టణ వాతావరణం నెలకొని ఉండేది.
అభిరామ్, మంజూషలు ఇరుగుపొరుగు వారు.  ఒకరంటే ఒకరికి వల్లమాలిన అభిమానం. మంజూషయితే తన తోడబుట్టిన అన్నయ్య కంటే అభిరామే ఎక్కువ అన్నట్లుగా ప్రవర్తించేది.
మంజూష తల్లిదండ్రులు కూడా అభిరామ్ ను అదే స్థాయిలో అభిమానించేవారు. తన ప్రతి కదలికలోనూ హుందాగా  వ్యవహరిస్తూ, నలుగురూ మెచ్చే విధంగా నడుచుకునే అభిరామ్, తానెంత కష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చినా, ఎదుటి వారి హృదయాలను నొప్పించకుండా ఉండేందుకు ప్రయత్నించేవాడు.
ఇంటర్మీడియట్ పాసయ్యాక అభిరామ్, మంజూషలు హన్మకొండలోని ఓ కాలేజీలో చేరారు. అభిరామ్ బిఎస్సీలో చేరితే మంజూష బి.కాం. తీసుకుంది.
అభిరామ్ యోగాకు వెడుతుంటే మంజూష కూడా తన అన్నతో పాటు వెళ్లి హాజరయ్యేది.
ఓరోజు మంజూష తన క్లాస్ మేట్ మాధవిని అభి రామ్ కు పరిచయం చేసింది. తొలిచూపులోనే మాధవిని ఆకట్టుకున్నాడు అభిరామ్. అలా ముగ్గురి మధ్య మంచి స్నేహం పెంపొందింది. ఫలితంగా మాధవి కూడా యోగా స్కూలులో చేరింది.
డిగ్రీ ఫైనలియర్ చదువుతుండగా, రాఘవతో తను ప్రేమలో పడ్డ విషయం మంజూష చెప్పినపుడు అభిరామ్ ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత మంజూషను చివాట్లేసాడు.  అప్పుడే ప్రేమలూ పెళ్లిళ్లూ ఏమిటని గద్దిస్తే మంజూష కళ్లనీళ్ల పర్యంతమైపోయింది. ముందు బుద్ధిగా చదువుకుని, జీవితంలో స్థిరపడ్డాక ఆ సంగతి ఆలోచించవచ్చని సర్ది చెప్పడంతో అప్పటికి ఆ విషయం సద్దుమణిగిపోయింది. ఈ విషయం విన్న మాధవి, అభిరామ్ పట్ల మరింత ఆకర్షితురాలయింది.
***.               ***.                ***
ఓ రోజు అభిరామ్ ను ఏకాంతంగా కలిసింది మాధవి.
'అభిరామ్... నీతో ఒక విషయం మాటాడాలనుకుంటున్నాను...' అంది మాధవి
'ఏమిటి...చెప్పు..' ఆసక్తిగా అడిగాడు అభిరామ్
'మరేం లేదు... నాపై నీ అభిప్రాయమేమిటో తెలుసుకుందామని...' నసిగింది మాధవి
'నువ్వు చాలా మంచి దానివి... తెలివైన అమ్మాయివి... నాకున్న కొద్ది మంది మంచి స్నేహితుల్లో నువ్వొకరివి! ' చెప్పాడు అభిరామ్
'అది కాదు ...' ఇబ్బందిగా చూసింది మాధవి
' మరి...???!!' రెట్టిస్తూ అడిగాడు అభిరామ్
"నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?" అని అడిగి సిగ్గుతో రెండు చేతుల్లో ముఖం దాచుకుంది మాధవి
'వ్హాట్!!! ' అదిరిపోయాడు అభిరామ్!
'ఇప్పుడే పెళ్లేమిటి మాధవి? నిన్న నీ ముందే కదా మంజూష, రాఘవలతో గొడవ పడింది! ఈరోజేమో నువ్వడుగుతున్నావు...'  అన్నాడతను
'నేనేమీ ఇప్పుడే పెళ్లి చేసుకుందామనడం లేదు. జీవితంలో స్థిరపడ్డాకే పెళ్లి చేసుకుందాం. నీ కోసం ఎన్నేళ్ళయినా వేచి చూస్తా ... నన్ను డిజప్పాయింట్ చేయనని నువ్వు మాట ఇస్తే చాలు..." చేయి చాస్తూ అడిగింది మాధవి.
'పెద్దవాళ్ళ ఇష్టాఇష్టాలతో ప్రమేయం లేకుండానా?' అన్నాడు అభిరామ్
'పెద్దవాళ్ళంటూ నాకున్నది ఒక్క అమ్మనే. అమ్మతో చెప్పాను. తను ఒప్పుకున్నాకనే నిన్ను అడుగుతున్నాను. ఒకవేళ మీ వాళ్ళ నుండి అభ్యంతరాలుంటే చెప్పు' అంది మాధవి
నసుగుతూనే తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెబుతున్న మాధవిని ఆశ్చర్యంగా చూసాడతను!
అభిరామ్ నుండి ఎలాంటి స్పందనా లేకపోవడంతో 'నీకిష్టం లేకపోతే వద్దులే" విచారంగా అంది మాధవి
"ఛ...ఛ...ఇష్టం లేకపోడానికేముంది మాధవి? నీకేం కుందనపు బొమ్మలావుంటావు. పైగా నా బెస్ట్ ఫ్రెండ్ వి! కానీ నేనాలోచించేది వేరు. మన చదువు పూర్తి కావాలి.. నాకో ఉద్యోగం రావాలి..  అన్నిటి కన్నా ముఖ్యం..మా అక్కయ్య  పెళ్లి కావాలి ..ఇవన్నింటికీ ఎంత కాలం పడుతుందో! నీకెలా మాట ఇచ్చేది? అని వెనుకాడుతున్నా మాధవి"
"థాంక్యూ అభి... అందుకే నువ్వంటే నాకంత ఇష్టం! మన ఈడు వాళ్ళు ఆలోచించే దానికి భిన్నంగా, పెద్ద తరహాలో ఆలోచిస్తావు. నీ సహచర్యంలో నా జీవితమంతా సంతోషంగా గడిచిపోతుందని నా నమ్మకం. నీ కోసం ఎంత కాలమైనా వేచి చూస్తా ... నన్ను డిజప్పాయింట్ చేయకపోతే చాలు..." సిగ్గుతో తల వంచుకొని అంటున్న మాధవి చేయందుకుని ఆమె చేతిలో తన చేయి వేసాడు అభిరామ్.
మాధవి ఆనందంతో అవాక్కయిపోయింది!!
***.             ***.           ****
ఓ రోజు యోగా క్లాస్ అయిపోయాక ఇంటికి వెడుతున్న అభిరామ్ ను పిలిచింది మాధవి. ఏమిటన్నట్లుగా చూసాడు అభిరామ్.
' అలా శివాలయానికి వెళ్దామా?' అంటూ ఆ పక్కనే ఉన్న గుడిలోకి దారి తీసింది మాధవి
'ఏమిటీ విషయం?' అంటూ ఆమెను అనుసరించాడు అభిరామ్
గుడి లోపలికి వెళ్లి దర్శనం చేసుకుని గుడి ఆవరణలో ఉన్న రావి చెట్టు కింద కూర్చుని మాధవి, అభిరామ్ కు చేయందించింది. మాధవి పక్కనే అభిరామ్ కూర్చున్నాడు
'ఊ...చెప్పు..ఏమిటి విశేషం?' నవ్వుతూ అన్నాడు అభిరామ్
'రాత్రి నువ్వు కల్లోకి వచ్చావు.. ఆ తర్వాత నిద్ర పట్టనేలేదు. మన గురించే ఆలోచనలు! చెబితే నువ్వు నవ్వుతావు... ' బిడియంగా చూసిందామె
'ఇది మరీ బాగుంది...నువ్వేమీ చెప్పకుండానే... నవ్వుతావు అని నన్నంటున్నావు! అసలు విషయం ఏమిటో చెప్పు' చిరునవ్వుతో అన్నాడు అభిరామ్
'నేను చెప్పలేను బాబూ...' చేతుల్లో ముఖం దాచుకున్న మాధవిని మురిపెంగా చూసాడతను
'సరే, చెప్పకపోతే పోనీ ...ఓ కాగితంపై రాసివ్వు... చదువుకుంటా' అన్నాడు అభిరామ్
'ఆల్రెడీ రాసాను. చదువుకో' అంటూ ఓ పేపర్ చేతిలో పెట్టిన మాధవిని ఆశ్చర్యచకితుడై చూసాడు
అదే మొదటి ప్రేమలేఖ! ఆమె తన భావాలను చక్కగా ముత్యాల్లాంటి అక్షరాలతో పొందుపర్చిన తీరు అభిరామ్ కు బాగా నచ్చింది.
'మనసున మనసై....బ్రతుకున బ్రతుకై' ఒకరికొకరు తోడూనీడగా ఉంటూ ప్రశాంతమైన జీవితాన్ని ఆస్వాదించాలన్నది ఆమె చిరకాల కోరిక అని,  ఆ కోరికకు తన పరిచయం ఊపిరి పోసిందన్న సంతోషాన్ని వ్యక్తం చేసింది.
ఆమె ప్రతిపాదనకు తాను ఓ.కె. చెప్పిన నాటి నుంచి కంటి మీద కునుకే లేదంటూ... 'కలలోనైనా నిన్ను చూద్దామంటే నిదురే రాని నాకు కలలేవిధంగా వస్తాయ'ని ప్రశ్నించింది.
సినిమా పాటల్ని  మాధవి బాగానే ఫాలో అవుతున్నట్టనిపించి నవ్వుకున్నాడు అభిరామ్.  చూడాలనిపించినప్పుడల్లా చూసుకునే విధంగా ఓ ఫోటో ఇవ్వమంది.
పెద్ద పెద్ద కళ్ళు, పొడవాటి ముక్కు, అందమైన పెదాలు ఆడవాళ్ళకే అందం అన్న భావన 'తన' అభిరామ్ ను చూసాక మార్చుకోవాల్సి వచ్చిందట! పరోక్షంగా తన అందాన్ని మెచ్చుకున్న తీరుకు నవ్వుకున్నాడు అభిరామ్
కేవలం ఊహాలోకపు ముచ్చట్లే కాక పెళ్లి తర్వాత ఇద్దరి జీవితం గురించి కూడా ఎన్నో రాసింది
నగర వాతావరణానికి దూరంగా, విశాలమైన తోటలో ఓ యోగా స్కూలు పెట్టి ఇద్దరమూ యోగా పాఠాలు చెబుతూ కాలం గడపాలని ఉందని రాసింది.
అంతా చదివిన అభిరామ్, ఆడపిల్లలకు మగవారి కన్నా తొందరగా మెచ్యూరిటీ వస్తుందేమోననుకున్నాడు.
ఆనందమో...ఉద్వేగమో...ఏదో తెలియని భావపరంపర అభిరామ్ ను ఆవరించింది
(సశేషం)

8 

Share


D
Written by
D. N. Subramanyam

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad